![]() |
| ప్రెస్ మీట్ లో హత్య వివరాలు తెలియజేస్తున్న భిక్నూర్ సి ఐ |
•వృద్ధురాలి హత్య కేసును 48 గంటల్లో ఛేదించిన కామారెడ్డి పోలీసులు
•మద్యం మత్తులో వెండి కడాల కోసం దారుణం, ఇద్దరు నిందితుల అరెస్ట్
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: భిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్‌గా నమోదైన 83 ఏళ్ల వృద్ధురాలి హత్య కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. దోపిడీ కోసం పథకం వేసి వృద్ధురాలిని హత్య చేసిన ఇద్దరు కూలీలను అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు భిక్నూర్ సీఐ సంపత్ కుమార్ తెలిపారు.
కేసు వివరాలు:
మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం బచ్చురాజుపల్లికి చెందిన 83 ఏళ్ల సుశీల, కాచాపూర్‌లోని తన కూతురు ఇంటి నుంచి ఏప్రిల్ 29న స్వగ్రామానికి బయలుదేరి కనిపించకుండా పోయింది. మే 1న ఆమె కొడుకు తోతళ్ల మల్లయ్య ఫిర్యాదుతో భిక్నూర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాలతో సీఐ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఫుటేజ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి దర్యాప్తు చేపట్టారు. రాజంపేట బస్టాండ్ వద్ద నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. (ప్రెస్ మీట్ వీడియో 👇)
దారుణమైన పథకం:
నిందితులు మేడిని బసవయ్య, 53, రాజంపేట గ్రామం, బుక్యా బూల, 27, షేర్ శంకర్ తాండ గ్రామానికి చెందిన కూలీలు. మద్యానికి బానిసలై ఆర్థిక ఇబ్బందులతో, ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి కుట్ర పన్నారు.
ఏప్రిల్ 29 సాయంత్రం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సుశీల చేతికి వెండి కడాలు చూసిన బూల, ఆమెను మాటల్లో పెట్టి కల్లు దుకాణానికి తీసుకెళ్లి బలవంతంగా కల్లు తాగించింది. అనంతరం బసవయ్య సూచనతో పొలం వద్దకు తీసుకెళ్లి, ఇద్దరూ కలిసి కడాలు లాక్కున్నారు. మిగిలిన కడాలు తీయలేక, ఎవరైనా చూస్తారనే భయంతో మత్తులో ఉన్న వృద్ధురాలిని సమీపంలోని ఎండిపోయిన బావిలోకి నెట్టి హత్య చేశారు. దోచుకున్న వెండి కడాలను పొలంలో దాచి ఇంటికి వెళ్లిపోయారు.
నిందితుల అరెస్ట్:
1. మేడిని బసవయ్య, తండ్రి రాజయ్య, 53 సం, రాజంపేట మండలం & గ్రామం
2. బుక్యా బూల, భర్త ప్రవీణ్, 27 సం, షేర్ శంకర్ తాండ, రాజంపేట మండలం
నిందితుల నుంచి వెండి కడాలను స్వాధీనం చేసుకొని, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల హెచ్చరిక:
"నేరస్థులకు చట్టం ఎంత కఠినంగా ఉంటుందో ఈ కేసు హెచ్చరిక. అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దు. ఒంటరి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి" అని సీఐ సంపత్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కామారెడ్డి జిల్లా పోలీసుల వేగవంతమైన చర్యలతో నిందితులు 48 గంటల్లోనే పట్టుబడ్డారు.


Post a Comment