పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు, లక్ష జరిమానా
తాడ్వాయి పోలీసుల పకడ్బందీ దర్యాప్తుతో నేరం రుజువు
మైనర్ బాలికను ఢిల్లీకి తీసుకెళ్లి లైంగిక వేధింపులు
సమర్థవంతంగా పనిచేసిన అధికారులను అభినందించిన ఎస్పీ
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి కామారెడ్డి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. తాడ్వాయి పోలీసుల పకడ్బందీ దర్యాప్తు, పక్కా సాక్ష్యాధారాలతో నేరం రుజువైందని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు.
05-08-2022 నాడు స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన తన కుమార్తె సాయంత్రం వరకు తిరిగి రాలేదని తల్లి తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్కూల్‌లో విచారించగా ఆ రోజు బాలిక రాలేదని తేలింది.
కేసు దర్యాప్తులో తాడ్వాయి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ అబ్దుల్ రహీం వయసు 20 సంవత్సరాలు, టెంట్ హౌస్ సమీపంలో ఐస్‌క్రీమ్ దుకాణానికి వచ్చే పదవ తరగతి మైనర్ బాలికతో చనువు పెంచుకున్నాడని తేలింది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
05-08-2022 నాడు స్కూల్‌కు వెళ్తున్న సమయంలో మాయమాటలు చెప్పి బాలికను కామారెడ్డి రైల్వే స్టేషన్‌కు, అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడ వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఆమెపై లైంగిక వేధింపులను కొనసాగించాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసును ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు ఢిల్లీలో బాలికను గుర్తించి సురక్షితంగా రక్షించారు. బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అన్ని సాక్ష్యాధారాలు సేకరించి పోక్సో చట్టం, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.
సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జిల్లా న్యాయమూర్తి డా. సీహెచ్.వి.వి.ఆర్ వరప్రసాద్ నిందితుడిపై అభియోగాలు రుజువయ్యాయని తేల్చి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ కేసులో సమర్థవంతమైన దర్యాప్తు నిర్వహించిన అప్పటి డీఎస్పీ ఏ. శ్రీనివాసులు, ప్రస్తుత డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కె. శేషు, సూర్యప్రసాద్, ఎస్‌హెచ్‌ఓ వై. నరేష్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్‌ఐ రామేశ్వర్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ టి. సాయిబాబులను జిల్లా ఎస్పీ అభినందించారు.
చిన్నారులపై దారుణాలకు తావులేదని, చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు.

Post a Comment