Top News

ABVP Rally | జులై 14న రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్

జులై 14న రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్

ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ABVP పిలుపు  

ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు

కామారెడ్డిలో విద్యార్థుల భారీ ర్యాలీ 

కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్: 

ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూలై 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల నుండి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని కళాశాలల బంద్ నిర్వహిస్తామని ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ప్రకటించారు.

కామారెడ్డిలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ, SC, ST, BC, EBC విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్య అందించేందుకు గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు.




రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుకుంటున్నారని, కానీ ప్రభుత్వం సకాలంలో ఫీజులు విడుదల చేయకపోవడంతో 11,000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఏటా 2 లక్షల మంది విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపుతున్నారని, 4.5 లక్షల మంది సర్టిఫికెట్లు అందుకోలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దీంతో ఇక్కడి విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.

గతంలో ప్రభుత్వంలో ఉండగా బకాయిలు చెల్లించడంతో పాటు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ అంశం కోర్టు వరకు వెళ్లిందని అన్నారు.

ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో విద్యార్థులు బలవుతున్నారని, బడ్జెట్ కాలేజీలు మూతపడుతున్నాయని, లెక్చర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు.

ఈ నిరసన ర్యాలీతో అయినా ప్రభుత్వం స్పందించాలని, లేకుంటే ఇదే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి నాంది అవుతుందన్నారు. అన్ని కళాశాల ప్రాంగణాలు, విశ్వవిద్యాలయాలు మరోసారి ఉద్యమ వేదికలు అవుతాయని హెచ్చరించారు.

పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ABVP ఆధ్వర్యంలో జూలై 14న నిర్వహించే రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్ ను విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు విజయవంతం చేయాలని మాచెర్ల రాంబాబు పిలుపునిచ్చారు.

Post a Comment

أحدث أقدم