Top News

Bike Accident | మైనర్ బాలుడి బైక్ స్టంట్‌కు అమాయకుడి బలి...!

మైనర్ బాలుడి బైక్ స్టంట్‌కు అమాయకుడి బలి....! రోడ్డున పడ్డ కుటుంబం...!!

తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు  

పదో తరగతి పాసైనందుకు బీఎండబ్ల్యూ బైక్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఉపాధ్యాయుడు  

అతివేగం, సర్కస్ ఫీట్లతో ఓ కుటుంబంలో విషాదం

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 18: మైనర్ బాలుడికి ఖరీదైన బైక్ ఇచ్చిన తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఓ అమాయకుడి ప్రాణం తీసింది. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇల్చిపూర్ చెరువు సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రికవరీ ఏజెంట్ పుల్లం వెంకటస్వామి (39) అక్కడికక్కడే మృతి చెందాడు.

అసలేం జరిగింది ?

మృతుడు వెంకటస్వామి సమీప బంధువు డాక్టర్ ఎ. జీవన్ తెలిపిన వివరాల ప్రకారం.....గాంధారి మండలంలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన కుమారుడు(16) పదో తరగతి పాస్ అయితే ఖరీదైన బీఎండబ్ల్యూ బైక్ గిఫ్ట్‌గా ఇస్తానని మాట ఇచ్చాడు. కొడుకు పాస్ కావడంతో బైక్ కొనిచ్చాడు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని ఆ మైనర్ బాలుడు అతివేగంతో బైక్ నడుపుతూ సర్కస్ ఫీట్లు చేస్తూ వాటిని స్టేటస్‌లలో పెట్టుకునేవాడు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

గురువారం ఇల్చిపూర్  సమీపంలో అదే బైక్‌పై అతివేగంగా వచ్చిన మైనర్ బాలుడు ఎదురుగా బైక్‌పై వస్తున్న వెంకటస్వామిని బలంగా ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయాలై వెంకటస్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాలుడికి గాయాలు కాగా కామారెడ్డి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు.

రోడ్డున పడ్డ కుటుంబం 

మృతుడు తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన రికవరీ ఏజెంట్. అతనికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వెంకటస్వామి మృతితో ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. తండ్రి ఇచ్చిన గిఫ్ట్ కారణంగా ఓ కుటుంబం దిక్కులేనిదైంది.

తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై ఆగ్రహం  

మైనర్లకు అత్యంత ఖరీదైన వాహనాలు ఇచ్చి రోడ్డుపైకి వదలడం తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే బైకులు, స్కూటీలు ఇవ్వడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు.

పోలీసుల దర్యాప్తు

సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్ఐ రంజిత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మైనర్ బాలుడిపై, వాహనం ఇచ్చిన తండ్రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Note : స్టేటస్ వీడియో కోసం డిస్క్రిప్షన్ లోని లింక్ ఓపెన్ చేయగలరు.

Post a Comment

أحدث أقدم