భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
భూ భారతి విజయవంతమైన అమలుకు భూ రీ-సర్వేనే కీలకం
మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయాలి
లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ.60 చెల్లింపు ప్రకటన
సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి
ఇందిరమ్మ ఇళ్లు, 2BHK ఇళ్ల పంపిణీలో వేగం పెంచాలి
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సమీక్ష
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
భూ రీ-సర్వే, భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు, రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ తదితర అంశాలపై మంత్రి శనివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ ఎన్.వై. గిరి, ఏడి ల్యాండ్ సర్వే శ్రీనివాస్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
భూ భారతి అమలుకు రీ-సర్వే తప్పనిసరి
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ భారతి అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ప్రజల అంచనాలకు పూర్తిస్థాయిలో చేరలేకపోయామని తెలిపారు.
ధరణి కాలంలో పెండింగ్‌లో ఉన్న 9.6 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూ భారతిలో అవకాశం కల్పించామని, తిరస్కరణలకు గల కారణాలను గుర్తించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే భూ రీ-సర్వే తప్పనిసరి అని మేధావులు సూచించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకోసం శిక్షణ పొందిన 5,700 మంది లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్ సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. లైసెన్స్ సర్వేయర్లకు ఉద్యోగం లేదా రెగ్యులరైజేషన్ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
మార్చి 2027 నాటికి పూర్తిపైలట్ ప్రాజెక్టుగా నక్షాలు లేని 413 ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వేతో 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
రీ-సర్వేకు అవసరమైన అత్యుత్తమ నాణ్యత గల పరికరాలను జిల్లా స్థాయిలో కొనుగోలు చేయాలని సూచించారు. కలెక్టర్లు భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని, అవసరమైన సిబ్బంది, పరికరాలు, మౌలిక వసతులు సమకూర్చాలని ఆదేశించారు. మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ. 50తో పాటు రవాణా, ఇతర ఖర్చుల కోసం మరో రూ.10 చెల్లించి మొత్తం రూ.60 అందజేస్తామని తెలిపారు. జూలై 28లోపు విధుల్లో చేరని లైసెన్స్ సర్వేయర్ల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్లు, ఇతర అంశాలు
మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న 2బీహెచ్‌కే ఇళ్లను ప్రస్తుత స్థితిలోనే లబ్ధిదారులకు అందజేసి, మిగిలిన పనులకు అనంతరం నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. నిధులు విడుదలైనా పనులు చేపట్టని చోట్ల బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని స్పష్టం చేశారు.
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వెంటనే పూర్తి చేసి గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 వేల గుడిసెలను గుర్తించామని, ఆగస్టు నాటికి రెండు లక్షల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని తెలిపారు.
సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థుల యూనిఫాంలను స్వయం సహాయక సంఘాల మహిళా టైలర్ల ద్వారా కుట్టిస్తున్నామని, ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.


إرسال تعليق