అంతర్‌జిల్లా అలవాటు నేరస్థుడు అరెస్ట్, దొంగిలించిన వాహనం స్వాధీనం
నిజామాబాద్‌లో బైక్ చోరీ చేసి రామారెడ్డిలో ట్రాలీ ఆటో ఎత్తుకెళ్లిన నిందితుడు
దర్యాప్తు బృందాన్ని అభినందించిన ఎస్పీ
కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:
రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ట్రాలీ ఆటో చోరీ కేసును రామారెడ్డి పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. అంతర్‌జిల్లా అలవాటు నేరస్థుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడంతో పాటు దొంగిలించబడిన ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలు
తేదీ 24.06.2026 సాయంత్రం సుమారు 17:00 గంటలకు నిజామాబాద్ నివాసి తోట నారాయణ రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు, ఇస్సన్నపల్లి గ్రామానికి చెందిన భూమ్పల్లి నరేష్‌కు చెందిన బజాజ్ ట్రాలీ ఆటో నెం. AP25X7950 ను తేదీ 23.06.2026 రాత్రి సుమారు 8:30 గంటలకు రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలోని శ్రీనివాస బిన్నీ రైస్ మిల్ షెడ్డు వద్ద పార్క్ చేసి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం రైస్ మిల్లు సిబ్బంది షెడ్డు వద్ద ట్రాలీ ఆటో కనిపించకపోవడంతో సమాచారం అందించారు. దీంతో ఫిర్యాదుదారుడు రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అంతర్‌జిల్లా నేరస్థుడి అరెస్ట్
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, రామారెడ్డి ఎస్‌ఐ మురళి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడు కానుగుల @ కుమ్మరి రాజు, మంచిప్ప గ్రామం, మోపాల్ మండలం, నిజామాబాద్ జిల్లా వాసిని తేదీ 04.07.2026న వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో నిందితుడు నిజామాబాద్‌లో దొంగిలించిన మోటార్ సైకిల్‌పై రామారెడ్డికి వచ్చి ట్రాలీ ఆటోను అపహరించిన అనంతరం, ఆ మోటార్ సైకిల్‌ను సమీపంలోని పొలాల్లో దాచిపెట్టినట్లు వెల్లడైంది. అనంతరం దాచిపెట్టిన బైక్‌ను విక్రయించేందుకు వచ్చిన సమయంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితుడు తన సహచరుడు గోత్రాల నాగరాజుతో కలిసి నిజామాబాద్‌లో ఒక మోటార్ సైకిల్‌ను, అనంతరం దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మోటార్ సైకిల్‌ను దొంగిలించినట్లు, అనంతరం పోసానిపేట శివారులోని శ్రీనివాస బిన్నీ రైస్ మిల్ షెడ్డు నుంచి బజాజ్ ట్రాలీ ఆటో నెం. AP25X7950 ను అపహరించినట్లు అంగీకరించాడు. నిందితుడి స్వాధీనం నుంచి దొంగిలించబడిన బజాజ్ ట్రాలీ ఆటో AP25X7950 తో పాటు ఒక IQOO స్మార్ట్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నారు.
అలవాటు నేరస్థుడిగా గుర్తింపు
ప్రధాన నిందితుడు కానుగుల @ కుమ్మరి రాజు గతంలో కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ తదితర జిల్లాల్లో నమోదైన పలు ఆస్తి నేరాల్లో నిందితుడిగా ఉండి, పలుమార్లు జైలు శిక్ష అనుభవించిన అలవాటు నేరస్థుడని డీఎస్పీ తెలిపారు. కాగా, ఈ కేసులో సహనిందితుడు గోత్రాల నాగరాజు ఇప్పటికే దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో కేసులో అరెస్టై జిల్లా జైలులో ఉన్నాడు.
దర్యాప్తు బృందానికి అభినందనలు
ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి, దొంగిలించబడిన ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన రామారెడ్డి ఎస్‌ఐ మురళి, కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ గౌడ్‌తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అభినందించినట్లు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ తెలిపారు.

إرسال تعليق