👉వృద్ధుడిని మోసగించి సొమ్ము అపహరించిన నిందితుడి అరెస్ట్
👉నిందితుడి నుండి వెండి కడియం, బంగారు తాయత్తు స్వాధీనం
👉రిమాండ్‌కు తరలింపు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది జరిగిన ఒక చోరీ కేసును బిచ్కుంద పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ వివరాలను బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే, అక్టోబర్ 22, 2025న శ జాదవ్ బన్సీలాల్ తన వ్యవసాయ పొలానికి వెళ్తుండగా దౌల్తాపూర్ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను అడ్డగించారు. మాయమాటలతో నమ్మించి, ఆయన వద్ద ఉన్న పది తులాల వెండి కడియం, 1.5 గ్రాముల బంగారు తాయత్తును అపహరించుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పట్లోనే కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా, ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు బిచ్కుంద పోలీసులు కందర్‌పల్లి శివారులో తనిఖీలు నిర్వహించారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నిందితుడు వర్ని మండలం, గోవూరు గ్రామానికి చెందిన గొప్ప భూమయ్య (తండ్రి: గంగారం)గా గుర్తించారు. నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించడంతో పాటు, బాధితుడి వద్ద నుండి దొంగిలించిన వెండి కడియం, బంగారు తాయత్తును పోలీసులకు అప్పగించాడు.
పోలీసులు సదరు సొత్తును స్వాధీనం చేసుకుని, నిందితుని రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసును ఛేదించడంలో చురుకుగా వ్యవహరించిన బిచ్కుంద ఎస్సై జి. రాజు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు సిఐ రవికుమార్ తెలిపారు

Post a Comment