త్యాగం, మానవత్వం గుర్తుచేసే పండుగ
బక్రీద్ నమాజ్‌లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్‌కు మద్దతు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: బక్రీద్ పర్వదినం సందర్భంగా కామారెడ్డి పట్టణంలో ముస్లింలు పండగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా కోర్టు ఆవరణ ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక నమాజ్‌లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గురువారం పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
త్యాగం, మానవత్వం గుర్తుచేసే పండుగ
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఈద్-ఉల్-అజ్హా విశ్వాసం, త్యాగం, కరుణ, మానవత్వం వంటి విలువలను గుర్తు చేస్తుందన్నారు. ప్రతి ఇంటిలో శాంతి, సంతోషం, సౌభ్రాతృత్వం నిండాలని ఆకాంక్షించారు. సమాజ సేవ, ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. (వీడియో 👇)
కుల గణనలో పాల్గొనాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుల గణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కుల గణన కీలకమని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని స్థానిక నాయకులు, అధికారులను ఆదేశించారు.
బీజేపీపై విమర్శలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై షబ్బీర్ అలీ విమర్శలు చేశారు. వ్యతిరేక ఓట్లను అక్రమంగా తొలగిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి ఎస్‌ఐఆర్ పేరుతో లక్షలాది ప్రతిపక్ష ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో 95 లక్షల ఓట్లు, బీహార్‌లోనూ ఇదే తరహాలో ఓట్లు తొలగించారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండి ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
భారతదేశం గంగా జమునా తహజీబ్‌తో, భిన్నత్వంలో ఏకత్వంతో వర్ధిల్లుతోందని, మతతత్వ బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు రేపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. ఆవును దేశ జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లిం మత పెద్దలు కోరగా, దానికి సంపూర్ణ సమర్థన తెలుపుతూ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ లౌకికత్వానికి కట్టుబడి ఉంటుందని, కులమతాలకు అతీతంగా అందరూ దేశాభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, మత పెద్దలు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి
కామారెడ్డి: బక్రీద్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీకి హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై పలు అంశాలు చర్చించారు. పట్టణంలో పండుగ వాతావరణం ప్రశాంతంగా, సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








إرسال تعليق