పిట్లంలో ఘనంగా 2కే రన్: డ్రగ్స్‌కు 'నో' చెప్పిన ప్రజలు
ఆరోగ్యకరమైన జీవితానికి 'యెస్' అంటూ యువత చైతన్యం
డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం: పోలీసులు
తెలంగాణ డైలీ న్యూస్,పిట్లం:డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణ లక్ష్యంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, పిట్లం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం "Say No to Drugs" నినాదంతో 2కే రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, మహిళలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఐక్య సందేశాన్ని సమాజానికి అందించారు.
ఈ సందర్భంగా బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య మాట్లాడుతూ, డ్రగ్స్ యువత జీవితాలను, కుటుంబాల ఆనందాన్ని, సమాజ భవిష్యత్తును నాశనం చేసే మహమ్మారి అని పేర్కొన్నారు. క్షణిక ఆనందం కోసం జీవితాన్ని పణంగా పెట్టవద్దని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని యువతకు సూచించారు.
పిట్లం ఎస్‌హెచ్‌ఓ బి. ఆంజనేయులు మాట్లాడుతూ, మన పిల్లలను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడితే మన కుటుంబాన్ని, గ్రామాన్ని, చివరికి దేశ భవిష్యత్తును కాపాడినట్టే అని అన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువత, ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
పిట్లం ప్రధాన వీధుల గుండా సాగిన 2కే రన్‌లో పాల్గొన్న వారంతా డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పిట్లం సర్పంచ్ చంద్రశేఖర్, తిమ్మానగర్ సర్పంచ్ ప్రవీణ్, పోతిరెడ్డిపల్లి సర్పంచ్ హేంసింగ్, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.



إرسال تعليق