Top News

Bad Road | ఇదేమి రోడ్డు? చెరువును తలపిస్తున్న బిచ్కుంద ప్రధాన రోడ్డు

ఇదేమి రోడ్డు? 

చెరువును తలపిస్తున్న బిచ్కుంద ప్రధాన రోడ్డు  

ఎక్కడ చూసినా గుంతలే, దుమ్ముతో సహవాసం చేస్తున్న ప్రజలు  

రూ.12 కోట్లు మంజూరైనా మూడేళ్లుగా సాగని పనులు  

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై పుర ప్రజల నిరసన

 ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వైరల్  

(తెలంగాణ డైలీ న్యూస్-కామారెడ్డి)

జుక్కల్ నియోజకవర్గంలోని ఏకైక మున్సిపల్ పట్టణమైన బిచ్కుందలో ప్రధాన రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైంది. వాహన చోదకులు పట్టణంలో ప్రవేశించిన వెంటనే పెద్ద పెద్ద గుంతలు, చెరువులా తలపించే రోడ్లు, దుమ్ము, ధూళి దర్శనమిస్తోంది.  

మూడేళ్లుగా అధ్వానంగా, స్పందన కరువు  

సుమారు మూడేళ్లుగా ఈ రోడ్డు ఇంత దారుణంగా ఉన్నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది. ఇక్కడ చేపట్టిన సెంట్రల్ లైటింగ్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బిచ్కుందలో చేపట్టిన పనులు ఏళ్లుగా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.  

పట్టణానికి ప్రతీ రోజు వివిధ పనుల నిమిత్తం మద్నూర్, జుక్కల్, పెద్దకొడప్‌గల్ తదితర ప్రాంతాల నుంచి వందలాది మంది వస్తారు. రోడ్డు దుస్థితి చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  






రూ.12 కోట్ల పనులు.. 20 శాతమే పూర్తి  

బిచ్కుందలో రహదారి విస్తరణ, కాలువలు, డివైడర్ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ.12 కోట్లు మంజూరయ్యాయి. గుత్తేదారు రోడ్డును ఎక్కడికక్కడ తవ్వి వదిలేశారు. కాలువల కోసం మట్టి తీసి వదిలేశారు. దీంతో రోడ్డుపై దుమ్ములేస్తోంది. వర్షం పడితే రోడ్డు చెరువును తలపిస్తోంది. ఇప్పటివరకు కేవలం 20 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు మొదలు పెట్టలేదు. 

వర్షాకాలం భయం, మళ్లీ ఆందోళన  

గతంలో స్థానిక యువత, ఎన్నికల ముందు భారాస నాయకులు ఆందోళన నిర్వహించారు. దీంతో కొద్ది రోజులు పనులు చేసి వదిలేశారు. వర్షాకాలం వస్తుండటంతో మళ్లీ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే రోడ్డు చెరువులా మారే పరిస్థితి ఉంది.  

ఇంస్టాగ్రామ్ లో వైరల్ అయిన వీడియో ఇదే 👆

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వైరల్  

ఈ రోడ్డు దుస్థితిపై ‘రాయల్ బిచ్కుంద’ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో తయారు చేసిన వీడియో జుక్కల్ నియోజకవర్గంలో వైరల్ అయింది. వేలాది మంది వీడియో చూసి లైక్ చేయడం, నాయకుల తీరుపై కామెంట్స్ చేయడం జరుగుతోంది.  


https://www.instagram.com/reel/DZOr9oXKXml/?igsh=ZjFkYzMzMDQzZg==

కాగా పెండింగ్ బిల్లుల సమస్యతో పలు మండలాల్లో పనులు ఆగాయని, బిచ్కుంద వంటి ప్రాంతాల్లో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నామని ఆర్‌అండ్‌బీ డీఈఈ పేర్కొన్నారు.  

పెండింగ్ బిల్లుల కారణంగా పనులు నిలిచాయని, నిధులు విడుదలైతే రెండు నెలల్లో బిచ్కుందలో పనులు పూర్తవుతాయని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఇటీవల పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم