Top News

BRS Membership Drive | "కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలం ": ప్రశాంత్ రెడ్డి ఫైర్

"కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలం ": ప్రశాంత్ రెడ్డి ఫైర్

"కేసీఆర్ పాలన జనరంజకం, ఇప్పుడు దోపిడీ పాలన"

రైతు డిస్కంల ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ 

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 4: కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రాష్ట్రంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం కామారెడ్డి పట్టణంలోని వెలమ ఫంక్షన్ హాలులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, విస్తృతస్థాయి సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  

సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు  

"సీఎం టీవీలో కనిపిస్తే చాలు ప్రజలు టీవీలు కట్టేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖం చూడటానికే ప్రజలు ఇష్టపడటం లేదు. అబద్ధాల కోరుగా, దుర్మార్గుడిగా, చేతకాని సీఎంగా, మోసకారిగా ప్రజల దృష్టిలో మిగిలిపోయాడు" అని ఆయన విమర్శించారు.  

"పదేళ్ల పాటు కేసీఆర్ జనరంజక పాలన అందించారు. రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉందో ప్రజలే బేరీజు వేసుకోవాలి. యూరియా సరఫరా అప్పటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితి చూడాలి. రైతులంటే రేవంత్ రెడ్డికి అంత చులకన ఎందుకు?" అని ప్రశ్నించారు.  





కరెంట్ కోతలపై ఆరోపణ  

గతంలో 24 గంటలు వచ్చిన విద్యుత్ ఇప్పుడు 11 గంటలకు పడిపోయిందని, దీంతో తెలంగాణలో మళ్లీ మోటార్లు కాలిపోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.  

అవినీతి ఆరోపణలు  

"సీఎం, మంత్రులు రాష్ట్రంపై గద్దల్లా వాలిపోతున్నారు. వేల కోట్ల విలువైన భూములను దోచుకుంటున్నారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన 14 ఎకరాల భూమిని ఫోర్త్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సివిల్ సప్లై, ఎక్సైజ్ శాఖలో రూ.6 వేల కోట్ల కుంభకోణం జరిగింది. వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన 116 ఎకరాల భూమిపై కూడా కన్నేశారు" అని ఆరోపించారు.  

రైతు డిస్కంలపై అభ్యంతరం  

"రైతు డిస్కం పేరుతో దోపిడీకి తెరలేపారు. ఆదాయం వచ్చే డిస్కంలను ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం ఏటా రూ.15 వేల కోట్లు ఖర్చు చేసింది. ఫ్యాక్టరీలు, కమర్షియల్ నుండి వచ్చే ఆదాయాన్ని రైతుల కోసం వినియోగించేవారు. కానీ ఇప్పుడు ఆదాయం వచ్చేవి ప్రైవేటుకు, నష్టాలు వచ్చేవి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రైతు డిస్కంల ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు.  

కేంద్రంపై విమర్శలు  

"కేంద్రం తెలంగాణకు నయాపైసా ఇవ్వడం లేదు. పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోంది. హైదరాబాద్ చుట్టూ నిర్మించే ఆర్.ఆర్.ఆర్ ప్రాజెక్టును కేంద్రం రిజెక్ట్ చేసింది. రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా ఆర్.ఆర్.ఆర్ ను ఎందుకు రిజెక్ట్ చేశారో కిషన్ రెడ్డి ప్రశ్నించాలి" అన్నారు.  

"కేసీఆర్ ఓటమి కామారెడ్డికి తీరని మచ్చ"  : మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. "నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడి నుండి పోటీ చేసిన మాజీ సీఎం కేసీఆర్ ఓడిపోవడం కామారెడ్డికి తీరని మచ్చ. ఈ మచ్చను చెరిపేసేలా ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే కృషి చేయాలి" అని పిలుపునిచ్చారు.  

"30 నెలలుగా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. దేవుళ్ల మీద ఒట్లు వేసి అమలు చేయలేని దౌర్భాగ్యపు సీఎం రేవంత్ రెడ్డి. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది" అని విమర్శించారు.  

"కేసీఆర్ హయాంలో రూ.8 కోట్లతో డిగ్రీ కళాశాల మైదానంలో శంకుస్థాపన చేస్తే, ఇప్పుడు ఇంచార్జి మంత్రి సీతక్క ఇందిరాగాంధీ స్టేడియంలో శంకుస్థాపన చేశారు. నాలుగేళ్ల క్రితం మంజూరైన స్టేడియం పనులు ఇప్పటికీ మొదలుపెట్టకపోవడం సిగ్గుచేటు. కేసీఆర్ తెచ్చిన రూ.23 కోట్ల నిధులతో పనులు చేస్తూ తామే తెచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం విడ్డూరం" అని ఎద్దేవా చేశారు.  

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ విజిగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్ షిండే తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم