సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదలపై ప్రత్యేక దృష్టి
జాతీయ పథకం ద్వారా నిజాంసాగర్ పూడికతీత, 17 నుంచి 25 టీఎంసీలకు పెంపు
దేశంలోనే అత్యధిక పంట తెలంగాణలోనే
మెడిగడ్డ బ్యారేజ్‌లో డిజైన్ లోపం
కాంగ్రెస్ హయాంలో సన్న బియ్యం
సిద్దపూర్ రివైజ్డ్ ఎస్టిమేట్
ప్రధానకాలువ వెంబడి సోలార్ పవర్
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగం
106 కోట్ల జాకోర పథకం ప్రారంభం, సిద్దపూర్‌కు 200 కోట్లు మంజూరు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 10: రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించారు. ఉదయం 11.25 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా వర్ని మండలం సిద్దపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. హెలికాప్టర్ వద్ద భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు పూలు జల్లుతూ మంత్రికి ఘన స్వాగతం పలికారు. గిరిజన మహిళలు సైతం పూలతో స్వాగతం పలికారు. మంత్రి రాకతో సిద్దపూర్ రిజర్వాయర్ పరిసరాలు సందడిగా మారాయి.
రిజర్వాయర్ పనుల పరిశీలన
అనంతరం సిద్దపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో పనుల పురోగతిపై ఆరా తీశారు. మధ్యాహ్నం 12 గంటలకు జాకోర మరియు చందూర్ ఎత్తిపోతల పథకాన్ని మెయిన్ స్విచ్ ఆన్ చేసి మంత్రి ప్రారంభించారు. అనంతరం జాకోరా లో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.
106 కోట్లతో జాకోర పథకం ప్రారంభం
బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. 106 కోట్లతో నిర్మించిన జాకోర పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సిద్దపూర్ రిజర్వాయర్ కోసం 200 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. వర్ని, చందూర్, మోస్రా మండలాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 7,500 ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. ఈ కాలువలకు సోలార్ పవర్ ఏర్పాటు చేయాలని నీటి పారుదల శాఖ కార్యదర్శిని ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదలపై ప్రత్యేక దృష్టి
సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదలపై ప్రత్యేక దృష్టి సారించారని, రాష్ట్రం లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు లకు రూ. 5 వేల కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఉ మ్మడి నిజామాబాద్ జిల్లాకు జలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నిజాం కట్టిన గొప్ప ప్రాజెక్టు నిజాంసాగర్ అని, పూడిక వల్ల నిల్వ సామర్థ్యం తగ్గిందన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ సామర్థ్యం 17 టీఎంసీలుగా ఉందని, దాన్ని 25 టీఎంసీలకు పెంచుతామన్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువ వెంబడి సోలార్ పవర్ ఏర్పాటు చేస్తామని, ఈ మేరకు డిజైన్, ఎస్టిమేట్ తయారు చేయాలని ఇరిగేషన్ శాఖ రాష్ట్ర కార్యదర్శిని ఆదేశించారు.
జాతీయ పథకం ద్వారా పూడికతీత
కడెం సహా రాష్ట్రంలోని మూడు ప్రాజెక్టులను జాతీయ పథకం ద్వారా పూడిక తీస్తున్నామని తెలిపారు. నిజాంసాగర్‌ను కూడా పూడికతీత ద్వారా 17 టీఎంసీల నుంచి 25 టీఎంసీలకు పెంచుతామన్నారు.
దేశంలోనే అత్యధిక పంట తెలంగాణలో
దేశంలోనే అత్యధిక పంట పండింది తెలంగాణలోనే అని, 295 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ప్రభుత్వం అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసిందని, 1.67 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 35 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు.
మెడిగడ్డ బ్యారేజ్‌లో డిజైన్ లోపం
ఇరిగేషన్‌కు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, మెడిగడ్డ బ్యారేజ్ డిజైన్ లోపభూయిష్టంగా ఉందన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. వందేళ్ల క్రితం కట్టిన నిజాంసాగర్‌కు ఏమీ కాలేదని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మెడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. కాంగ్రెస్ నిర్మించిన పోచంపాడ్ ప్రాజెక్టు ఇప్పటికీ బాగుందని, కాళేశ్వరంలో పూర్ కన్స్ట్రక్షన్ ఉందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ హయాంలో సన్న బియ్యం
కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు దొడ్డు బియ్యం వచ్చేవని, కాంగ్రెస్ వచ్చాక సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. గత పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇప్పుడు 1.05 కోట్ల రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు.
సిద్దపూర్ రివైజ్డ్ ఎస్టిమేట్
సిద్దపూర్ ప్రాజెక్టుకు రివైజ్డ్ ఎస్టిమేట్ చేస్తామని, రూ. 200 కోట్లు మంజూరు చేస్తామని, ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ వయసులో కూడా ప్రజల కోసం పనిచేస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటం బాన్సువాడ ప్రజల అదృష్టమని కొనియాడారు. ఈ పంటకు నిజాంసాగర్ నుంచి నీరు అందిస్తామని భరోసా ఇచ్చారు.
బహిరంగ సభలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. రెండు రోజులు అన్నం లేకపోతే ప్రాణం ఉండదని, రైతుకు భూమి, విత్తనం, శ్రమతో పాటు నీరు ముఖ్యమని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన మొదటి పథకం జాకోర ఎత్తిపోతల పథకమని గుర్తు చేశారు.
లక్షా 48 వేల ఎకరాలకు సాగునీరు
బాన్సువాడ నియోజకవర్గంలోని 9 మండలాలు, ఒక మున్సిపాలిటీ పరిధిలో 61 వేల కుటుంబాలు ఉన్నాయని, మొత్తం లక్షా 48 వేల ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఇందులో 30 వేల ఎకరాలకు బోర్ల సౌకర్యం ఉండగా, 24 వేల ఎకరాలకు నిజాంసాగర్ నీరు అందడం లేదన్నారు. సిద్దపూర్ నుంచి 13 వేల ఎకరాలకు, జాకోర నుంచి 10 వేల ఎకరాలకు రెండు పంటలకు నీరు అందిస్తామని చెప్పారు. ఈ పథకాలు వందేళ్లు ఉంటాయని, బాన్సువాడ నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా నీరు లేకుండా ఉండదని స్పష్టం చేశారు. ఎకరానికి రెండు పంటలతో 70 క్వింటాళ్ల దిగుబడి వచ్చి 1.50 లక్షల ఆదాయం మిగులుతోందని, సెగ్మెంట్‌లో 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని తెలిపారు. ఏప్రిల్‌లో కాంతాలు పోసి నాట్లు వేసుకుంటున్నామని, తమది ఆదర్శ నియోజకవర్గమని అన్నారు. చింతకుంటకు నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ సందర్బంగా పోచారం భాస్కర్ రెడ్డి మంత్రి ని ఘనంగా సన్మానించారు.
హాజరైన ప్రముఖులు
ఈ కార్యక్రమాల్లో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఇంచార్జి సీపీ రాజేష్ చంద్ర, నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠీ, మార్కెట్ కమిటీ వర్ని అధ్యక్షులు సురేష్ బాబా పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
































إرسال تعليق