Top News

Drunk and Drive | మద్యం తాగి డ్రైవ్ చేస్తే కటకటాలే

మద్యం తాగి డ్రైవ్ చేస్తే కటకటాలే 

62 మందికి జరిమానా, 10 మందికి జైలు శిక్ష  

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం: ఎస్పీ రాజేష్ చంద్ర 

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 8: మద్యం సేవించి వాహనాలు నడిపితే భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర హెచ్చరించారు. "ఒక్క క్షణం అజాగ్రత్త జీవితాంతం విషాదం మిగుల్చుతుంది" అని ఆయన పేర్కొన్నారు.  

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 62 మంది వాహనదారులకు కోర్టు శిక్షలు విధించింది. వీరికి మొత్తం రూ.73,500 జరిమానా పడింది.  

జైలు శిక్షలు  

మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించినందుకు 8 మందికి ఒక రోజు జైలు శిక్ష, ఒక వ్యక్తికి రెండు రోజుల జైలు, మరో వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు.  

ఎస్పీ హెచ్చరిక  

ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, "ప్రతిరోజూ మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మీ కుటుంబ సభ్యులు చెప్పే ‘జాగ్రత్తగా వెళ్లండి’ అనే మాటలో, మీరు క్షేమంగా తిరిగి రావాలనే ప్రేమ, ఆరాటం దాగి ఉంటుంది. కానీ రోడ్డుపై చేసే ఒక చిన్న అజాగ్రత్త ఆ ఎదురుచూపులను శాశ్వత విషాదంగా మార్చివేస్తుంది" అని అన్నారు.  

"రోడ్డు ప్రమాదం అంటే కేవలం వార్త కాదు. అది ఒక తల్లి కన్నీరు, ఒక తండ్రి మౌనం, కుటుంబానికి తీరని వేదన. మీ క్షణిక ఆనందం కోసం మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టవద్దు" అని సూచించారు.  

భవిష్యత్తుకు ముప్పు 

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని, ఇది భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక గౌరవంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎస్పీ హెచ్చరించారు.  

ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించినప్పుడు స్వయంగా వాహనం నడపకుండా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. "ప్రజల ప్రాణ రక్షణే మా ప్రధాన లక్ష్యం. మీ ప్రయాణం సురక్షితంగా సాగి, క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాం" అని ఎస్పీ తెలిపారు.

Post a Comment

أحدث أقدم