పేద విద్యార్థులకు శాపంగా మారిన నవోదయ కోచింగ్ సెంటర్లు
లాంగ్‌టర్మ్ కోచింగ్ పేరుతో లక్షల్లో ఫీజుల దోపిడీ
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉచిత శిక్షణ ఇవ్వాలని డిమాండ్
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 9: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన 'జవహర్ నవోదయ విద్యాలయాల' ప్రవేశానికి వేల సంఖ్యలో విద్యార్థులు పోటీ పడుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు లాంగ్‌టర్మ్ కోచింగ్ పేరుతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ పేదలకు శాపంగా మారుతున్నాయి.
నవోదయ ప్రవేశ పరీక్షలో సీటు సాధించడం కోసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు పేద తల్లిదండ్రుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ వారిని ఆర్థికంగా నిండా ముంచుతున్నాయి.
పేదలకు భారంగా కోచింగ్ సెంటర్లు
భారీ ఫీజుల దోపిడీ: 5వ తరగతి చదివే పిల్లలకు ప్రవేశ పరీక్షలో సీటు ఇప్పించేందుకు ప్రైవేట్ సంస్థలు నెలకు వేలల్లో వసూలు చేస్తున్నాయి. వసతి గృహాలతో కలిపి సంవత్సరానికి లక్షల రూపాయల వరకు ఖర్చవుతోంది.
అప్పుల పాలు: వ్యవసాయం, కూలి పనులపై ఆధారపడే గ్రామీణ పేద తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి, ఆస్తులు అమ్మి మరీ ఈ ఫీజులు చెల్లిస్తున్నారు.
భయం సృష్టిస్తున్నాయి: నవోదయ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, కోచింగ్ సెంటర్లు లేనిదే పరీక్ష పాస్ కాలేరనే అపోహను సృష్టించి వ్యాపారం చేస్తున్నాయి.
చిన్న వయస్సులోనే ఒత్తిడి: 14 ఏళ్లలోపు విద్యార్థులను హాస్టళ్లలో ఉంచి, ఆటపాటలు దూరం చేసి కేవలం పరీక్షల కోసమే చదివించడం వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించక విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
నవోదయ విద్యాలయాల అసలు లక్ష్యంనవోదయ విద్యాలయాల్లో విద్య, భోజనం, పుస్తకాలు, యూనిఫాం వంటివన్నీ పూర్తిగా ఉచితం. ఎస్సీ, ఎస్టీ, బాల బాలికలు, బీపీఎల్ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఎలాంటి ఫీజులు ఉండవు. 10+2 విధానంలో ఇక్కడ విద్య ఉంటుంది. ఇక్కడ చదివిన విద్యార్థులు కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రికార్డు ఉంది.
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌లో నవోదయ విద్యాలయం ఉంది. ప్రతి ఏడాది నవోదయలో ప్రవేశానికి ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది వరకు ఐదవ తరగతి విద్యార్థులు పరీక్ష రాస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి ఉండగా, నేడు జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లు వెలిశాయి. వీటికి విద్యా శాఖ నుంచి అనుమతులు లేకపోవడం గమనార్హం.
అవగాహన లేకపోవడంతో చాలా మంది పేదలు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ఉచ్చులో పడుతున్నారు. నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలనే ప్రభుత్వ ఆశయానికి కోచింగ్ మాఫియా పెద్ద అవరోధంగా మారింది. ప్రభుత్వాలు, అధికారులు స్పందించి గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లోనే నవోదయ ప్రవేశ పరీక్షలకు తగిన శిక్షణ లభించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యావేత్తలు, తల్లిదండ్రులు కోరుతున్నారు.



إرسال تعليق