తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం
జూన్ 30న పదవీ విరమణ చేయనున్న కే రామకృష్ణారావు స్థానంలో బాధ్యతలు
మీసేవ ఆలోచనకర్తగా గుర్తింపు పొందిన సీనియర్ ఐఏఎస్
తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ కే రామకృష్ణారావు జూన్ 30న పదవీ విరమణ చేయనుండడంతో ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం రఘునందన్ రావు గురువారం జీవో ఆర్టీ నంబర్ 911 విడుదల చేశారు. 1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సమర్థుడైన అధికారిగా సంజయ్ జాజుకు మంచి గుర్తింపు ఉంది. విజయవాడ సబ్ కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి కలెక్టర్‌గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా సేవలు అందించారు.
ముఖ్యంగా నేడు కోట్లాది మంది ప్రజలు ఉపయోగిస్తున్న ఐటీ ఆధారిత ప్రభుత్వ పౌర సేవలు మీసేవ, మున్సిపల్ సేవల్లో పారదర్శకత తెచ్చిన సౌకర్యం ప్రాజెక్టులకు ఈయనే ఆధ్యుడు. సాంకేతికత ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకే చేర్చవచ్చని నిరూపించిన డిజిటల్ విప్లవకారుడిగా ఆయనకు పేరుంది.
2014 అక్టోబర్‌లో కేంద్ర డెప్యుటేషన్‌పై వెళ్లిన సంజయ్ జాజు, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన శాఖలలో ఉన్నతాధికారిగా దేశానికి సేవలందించారు.

إرسال تعليق