Top News

CEO Orders | రేపటిలోగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలి

రేపటిలోగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలి

డిజిటైజేషన్‌ను వేగవంతం చేయాలని CEO సుదర్శన్ రెడ్డి ఆదేశం

కామారెడ్డి జిల్లాలో 99% పంపిణీ పూర్తి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:  

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను రేపటిలోగా పూర్తి చేసి, డిజిటైజేషన్‌ను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష

సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్‌ఓలు), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్‌ఓలు)తో సీఈఓ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 25 నుంచి ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ తుది దశకు చేరుకుందని తెలిపారు. పంపిణీ చేసిన ఫారాలను ఓటర్లు పూర్తి చేసిన తర్వాత వాటిని తిరిగి సేకరించి, సంబంధిత బీఎల్‌ఓలు BLO యాప్‌లో డిజిటైజేషన్ చేయాలని సూచించారు. అవసరమైతే వాలంటీర్ల సహకారంతో ఓటర్లకు ఫారాల పూరణలో సహాయం అందించాలని తెలిపారు.

జూలై 20 నాటికి డిజిటైజేషన్ పూర్తి చేయాలి  

డిజిటైజేషన్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జూలై 20 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అనంతరం పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపట్టి, ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,200 మందికి మించకుండా ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తప్పుడు సమాచారం సమర్పించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కామారెడ్డి జిల్లాలో పురోగతి  

కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొని మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 99 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తైందని, మిగిలిన ప్రక్రియను రేపటిలోగా పూర్తి చేస్తామని తెలిపారు.

జిల్లాలో డిజిటైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌ను పకడ్బందీగా చేపడతామని, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలతో కార్యాచరణ ప్రకారం సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో కృషి చేస్తున్నామని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్.వి. గిరి, ఎల్లారెడ్డి ఆర్డీవో, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم