ఎల్లారెడ్డిలో జూదంపై పోలీసుల దాడి
ఐదుగురు అరెస్ట్, రూ.21,350 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం
జూదం గెలిపించేది డబ్బు కాదు, ఓడిపోయేది జీవితం: ఎస్పీ
యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపు
ఎల్లారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:
ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి అక్రమంగా జూదం ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో నిందితుల వద్ద నుంచి రూ.21,350 నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్లారెడ్డి ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు.
జూదం వ్యసనం ప్రమాదకరం
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, జూదం అనేది కేవలం చట్టవిరుద్ధమైన చర్య మాత్రమే కాదని, అది కుటుంబాలను, భవిష్యత్తును, వ్యక్తిత్వాన్ని నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనమని అన్నారు.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో జూదానికి అలవాటు పడిన వారు చివరకు అప్పులపాలై కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయి విలువ, జూదంలో గెలిచే వెయ్యి రూపాయల కంటే ఎంతో గొప్పదని అన్నారు.
యువత తమ సమయాన్ని విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు మరియు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలపై వెచ్చించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. చట్టవిరుద్ధ మార్గాలు ఎప్పటికీ శాశ్వత విజయాన్ని ఇవ్వవని, నిజాయితీ, కృషి, క్రమశిక్షణ మాత్రమే జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని చెప్పారు.
ప్రజలకు విజ్ఞప్తి
జూదం, గేమింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం నేరమని, ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాజాన్ని వ్యసనాల బారిన పడకుండా కాపాడటంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

إرسال تعليق