బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్
12 మందికి అస్వస్థత, 9 మంది పరిస్థితి విషమం
బాన్సువాడ ఆసుపత్రికి తరలించిన విద్యార్థులు
ఆహార నాణ్యతపై సర్పంచ్ ఆగ్రహం
బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్:
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది.
ఘటనలో సుమారు 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 9 మందికి తీవ్రమైన విరేచనాలు, వాంతులు రావడంతో కళాశాల యాజమాన్యం అప్రమత్తమైంది. వెంటనే అంబులెన్సుల ద్వారా అందరినీ బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. (Video 👇)
పాత నూనె వాడటమే కారణమా?
నిన్న ఉదయం వాడిన వంట నూనెనే రాత్రి పూరీలు వేయడానికి మళ్లీ ఉపయోగించడంతో ఆహారం కలుషితమై ఉండొచ్చని కొందరు విద్యార్థులు తెలిపారు. తాము తిన్న ఆహారంలో నాణ్యత లేని నూనె వాసన వచ్చిందని వారు ఆరోపించారు.
సర్పంచ్ ఆసుపత్రి సందర్శన
ఘటన గురించి తెలుసుకున్న బీర్కూర్ సర్పంచ్ అరిగె ధర్మతేజ సోమవారం ఉదయం బాన్సువాడ ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శివకుమార్ పై తీవ్రంగా మండిపడ్డారు.
విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ వద్దని, రోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని ఆయన ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా వంటశాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆహార పదార్థాల నాణ్యతను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు.
ఫుడ్ పాయిజన్‌కు గల ఖచ్చితమైన కారణాన్ని వైద్య నివేదిక, అధికారుల విచారణ తర్వాతనే నిర్ధారించగలమని అధికారులు చెప్పారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.
9 మందిని అడ్మిట్ చేశాం : ఏరియా ఆసుపత్రి వైద్యుడు
నిన్న తిన్న ఆహారానికి విద్యార్థులు వాంతులు, వీరేచనాలు చేసుకున్నారు. మొత్తం 12 మందిని తీసుకురాగా 9 మంది ఆరోగ్యం బాగా లేనందున అడ్మిట్ చేశాం. మరో ముగ్గురికి ఒపీవైద్యం చేశాం. ఫుడ్ పైజన్ ఇది.


إرسال تعليق