ఆర్మూర్ మెడికల్ షాపులో రూ.1.5 లక్షల చోరీ
నిజామాబాద్ నగరంలో వరుస చైన్ స్నాచింగ్‌లు
దాడులతో భయాందోళనలో మహిళలు
రంగంలోకి 3 ప్రత్యేక పోలీసు బృందాలు
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ సాయి చైతన్య
తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్, జూలై 12: నిజామాబాద్ జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠా రెచ్చిపోయింది. టాటా సుమోలో వచ్చిన నలుగురు సభ్యుల ముఠా జిల్లాలోని పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లు, చోరీలకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది.
నిర్మల్ నుంచి ఆర్మూర్‌కు...
* ముఠా తొలుత నిర్మల్ పట్టణంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి పాల్పడింది.శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జిల్లాలోకి ప్రవేశించిన దుండగులు ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ షాపు షట్టర్‌ను ధ్వంసం చేసి షాపులో ఉన్న రూ. 1.5 లక్షల నగదును దోచుకున్నారు.
నిజామాబాద్ నగరంలో వరుస దాడులు
* అనంతరం ముఠా టాటా సుమోలో నిజామాబాద్ నగరంలోకి ప్రవేశించింది. తెల్లవారుజామున విజయ్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీలో ఓ మహిళపై దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు.
* దుబ్బ ప్రాంతంలోని సబ్ స్టేషన్ వద్ద ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న మరో మహిళపై దాడి చేశారు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెను కొట్టి బంగారు గొలుసు, ఒక చెవికమ్మను తీసుకున్నారు. మరో చెవికమ్మ తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు.
* ఇదే ప్రాంతంలో వాకింగ్ చేస్తున్న మహిళల నుంచి గొలుసు లాక్కెళ్లేందుకు కూడా ముఠా ప్రయత్నించగా, ఆమె అప్రమత్తమై గొలుసును గట్టిగా పట్టుకోవడంతో వారి ప్రయత్నం విఫలమైంది.
మహిళల్లో భయాందోళన
వరుస దాడులతో ఉదయం పూట బయటకు వచ్చి పనులు చేసుకునేందుకు మహిళలు భయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

టాటా సుమో సిసి ఫుటెజీ
సీపీ పర్యటన, ప్రత్యేక బృందాలు
దుబ్బ ప్రాంతంలో చైన్ స్నాచింగ్ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. సమాచారం తెలుసుకున్న సీపీ సాయి చైతన్య సంఘటన స్థలానికి వెళ్లి బాధితులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. బ్లూ కోల్ట్ సిబ్బంది సేవలు, పెట్రోలింగ్ పై ఆరా తీశారు. శనివారం రెండు చోట్ల టాటా సుమోలో వచ్చి చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన దుండగులు అనంతరం జిల్లాను వదిలి పారిపోయినట్లు సమాచారం.
చైన్ స్నాచింగ్ ముఠా కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు సీపీ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీఎస్ డీఎస్పీ శ్రీశైలం ఆధ్వర్యంలో బృందాలు దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి.




إرسال تعليق