Top News

Student Suicide Cause | మృతిపై భిన్న వాదనలు - నిజమేంటి?

బాన్సువాడ ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య 

 మృతిపై భిన్న వాదనలు - నిజమేంటి?  

"ఇంటిపై బెంగ" అంటున్న పోలీసులు, "రూ.10 వేల డిమాండ్" అంటున్న సంఘాలు 

కుటుంబానికి రూ.50 వేల సాయం, ఉద్యోగ హామీ

తెలంగాణ డైలీ న్యూస్,  బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ బాలికల గురుకుల వసతి గృహంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతికి గల కారణంపై మాత్రం రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.

ఏది నిజం? భిన్న కారణాలు

డోంగ్లీ మండలం లక్ష్మాపూర్‌కు చెందిన సరిడివార్ అమృత వయసు 17. వారం రోజుల క్రితమే బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్‌లో చేరి టీచర్స్ కాలనీలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఉంటోంది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం నాన్నను విడిచి హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక, హోంసిక్‌తో ఈ దారుణానికి పాల్పడింది. ఈ విషయాన్ని తన నోట్ బుక్‌లో కూడా రాసినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజులుగా అనారోగ్యంతో ఉన్న అమృత తండ్రి మైసయ్యకు ఫోన్ చేసి "నాన్నను చూడాలని ఉంది" అని చెప్పింది. బుధవారం కళాశాలకు వెళ్లకుండా గదిలో ఉరేసుకుంది. అదే సమయంలో వచ్చిన తండ్రి తలుపులు పగలగొట్టి చూసేసరికే మృతి చెందింది. ఆ సమయంలో హాస్టల్ వార్డెన్ లేరు.

అయితే బాన్సువాడ నుంచి డోంగ్లీ 50 కిలోమీటర్లు మాత్రమే ఉండటంతో, నాన్న గుర్తుకు వస్తే ఇంటికి వెళ్లి రావచ్చు కదా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది.

మరోవైపు విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాత్రం వేరే కోణం చెబుతున్నారు. "హాస్టల్‌లో ఉండేందుకు వార్డెన్ రూ.10 వేలు డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగింది" అని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆందోళన - అధికారుల హామీ

సంఘటన తర్వాత విద్యార్థి సంఘాల నేతలు హాస్టల్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించకుండా అడ్డుకున్నారు. 

సమాచారం అందుకున్న ఆర్డీఓ రవీందర్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ప్రభుత్వ సాయం

కలెక్టర్ ఆదేశాల మేరకు అంత్యక్రియల నిమిత్తం రూ.50 వేల తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, అర్హత ఉంటే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వార్డెన్ నిర్లక్ష్య కోణంతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

أحدث أقدم