ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్
మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు
రోడ్డు భద్రత పై ప్రతిజ్ఞ
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడిగా చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఆయన చూపించిన మార్గం సమానత్వం, విద్య, స్వాభిమానం అనే విలువలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
అంతేకాకుండా, విద్య ద్వారా మాత్రమే సామాజిక, ఆర్థిక పురోగతి సాధ్యమని, యువత అంబేద్కర్ బాటలో నడిచి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ B. R. Ambedkar రూపొందించిన రాజ్యాంగ ఆర్టికల్స్ (Articles) పై జిల్లా కలెక్టర్ సమగ్రంగా వివరిస్తూ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి ఆర్టికల్ దేశ ప్రజల హక్కులు, బాధ్యతలు, సామాజిక న్యాయం సమానత్వాన్ని పరిరక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా మౌలిక హక్కులు, దిశానిర్దేశక సూత్రాలు (Directive Principles), పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన ఆర్టికల్స్ గురించి సవివరంగా చర్చించారు.
అలాగే, డాక్టర్ అంబేద్కర్ దూరదృష్టి వల్లే భారతదేశం ఒక ప్రజాస్వామ్య, సమానత్వం ఆధారిత దేశంగా ఎదిగిందని కొనియాడారు. అనంతరం ఆయన చూపిన మార్గంలో నడవాలని, రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టాలని అందరికీ పిలుపునిచ్చారు.అనంతరం కైలాస్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.*
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ NV గిరి, తహసీల్దార్ హిమభిండు మున్సిపల్ ఛైర్పర్శన్ ఉమారాణి వివిధ శాఖల అధికారులు, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మెగా రక్తదాన శిబిరం
ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవియఫ్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం జిల్లా కేంద్రంలోని కర్షక్ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు నిరంతర రక్తదానం ఎంతో అవసరమని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రక్తదానం చేసిన దాతలకు కలెక్టర్ స్వయంగా సర్టిఫికెట్‌లు హెల్మెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ విక్టర్,ఐవియఫ్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ
అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.
రోడ్డు భద్రతా నియమాలను పాటించడం, ఇతరులకు తెలియజేయడం, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవించడం, ప్రమాదాలను నివారించడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేయబడింది.
ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి, రోడ్డు భద్రతకు సహకరించాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని తెలియజేశారు.
రహదారి భద్రతా ప్రతిజ్ఞ ఇదే
నేను భారతదేశ పౌరుడిగా, మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరుగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినపుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని, ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.



Post a Comment