Petrol, Diesil Price Hike | పెట్రోల్, డీజిల్ ధరలకు మళ్లీ రెక్కలు

 


పెట్రోల్, డీజిల్ ధరలకు మళ్లీ రెక్కలు

లీటర్ పెట్రోల్‌పై ₹2.84, డీజిల్‌పై ₹2.86 పెంపు... 

ఈరోజు ఉదయం 6 గంటల నుంచే అమలు  

 తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చమురు సంస్థలు మరోసారి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకుల నెపంతో ఇంధన ధరలను భారీగా పెంచాయి.  

పది రోజుల్లో నాలుగోసారి పెంపు

గత పది రోజుల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. వరుస పెంపులతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న వాహనదారులపై ఈ తాజా నిర్ణయం మరింత భారంగా మారింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు శరవేగంగా రేట్లను సవరిస్తూ ఈ తాజా వాత పెట్టాయి.  

ఎంత పెరిగాయంటే

ఈరోజు ప్రకటించిన సవరణల ప్రకారం లీటర్ పెట్రోల్‌పై ₹2.84 పెంపు, లీటర్ డీజిల్‌పై ₹2.86 పెంపు ఉంది. పెరిగిన ఈ భారీ ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చేశాయి. దీంతో ఉదయాన్నే బంకులకు వెళ్లిన వాహనదారులకు రేట్లను చూసి ఫ్యూజులు అవుట్ అయ్యాయి.  

విమర్శల్లో చమురు సంస్థలు 

ఒకేసారి ఐదు లేదా ఆరు రూపాయలు పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే, చమురు సంస్థలు విడతల వారీగా రేట్లు పెంచుకుంటూ పోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత పది రోజుల్లోనే నాలుగు సార్లు రేట్లు మార్చడం దీనికి నిదర్శనం. ప్రతి రెండు, మూడు రోజులకు ఒకసారి పైసల్లో కాకుండా ఏకంగా రెండు రూపాయలకు పైగా పెంచేస్తూ పోతుండటంతో లీటర్ ఇంధనం ధరలు సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతున్నాయి.  

నిత్యావసరాలపై ప్రభావం  

కేవలం పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వాహనదారులకే పరిమితం కాదు. దీని ప్రభావం చైన్ రియాక్షన్ లా అన్ని వర్గాలపై పడనుంది. రవాణా భారం పెరిగితే ఆటోమేటిక్‌గా మార్కెట్‌కు వచ్చే కూరగాయలు, పప్పులు, పాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగక తప్పదు.



Post a Comment

أحدث أقدم