Road Encroachment | మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు బేఖాతర్!


మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు బేఖాతర్!

రోడ్డు ఆక్రమించి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం పూర్తి  

తొలగింపునకు చర్యలు తీసుకుంటామన్న కమిషనర్

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 15: బాన్సువాడ పట్టణంలో భారత్ గార్డెన్స్ ప్రక్కన 40 ఫీట్ల రోడ్డును ఆక్రమించి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేపట్టిన వ్యవహారం వివాదాస్పదమైంది. మున్సిపల్ కమిషనర్ పనులు నిలిపివేయాలని నోటీసు జారీ చేసినా నిర్మాణదారుడు బేఖాతర్ చేస్తూ అర్ధరాత్రి నిర్మాణం పూర్తి చేశాడు.

వార్డు నెం. 3 కౌన్సిలర్ ఎం.ఎ. హకీం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పురపాలక కమిషనర్ స్పందించి జూన్ 5, 2026న నోటీసు జారీ చేశారు. ఓ వ్యక్తి చేపడుతున్న గృహ నిర్మాణానికి సంబంధించిన సెప్టిక్ ట్యాంక్‌ను 5 ఫీట్ల వరకు ముందుకు వచ్చి రోడ్డును ఆక్రమించుకుని నిర్మిస్తున్నట్లు ఫిర్యాదు అందింది.

నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేసి, అనుమతి పత్రాలను 3 రోజులలో కార్యాలయానికి సమర్పించాలని, లేనిపక్షంలో పురపాలక చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు.

అయితే నోటీసును బేఖాతర్ చేస్తూ సదరు నిర్మాణదారుడు అర్ధరాత్రి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేసి, ట్యాంకు బయట కనబడకుండా మొరం వేసి మూసివేశాడు. ట్యాంక్ బండ్, కల్కి చెరువు, పార్కు, బోర్లం గ్రామానికి వెళ్ళే ఈ 40 ఫీట్ల రోడ్డును ఆక్రమించేందుకు పలువురు ప్రయత్నిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

విచారణ జరుపుతాం : తెలంగాణ డైలీ న్యూస్ తో మున్సిపల్ కమిషనర్ గంగాధర్ 

 "భారత్ గార్డెన్ పక్కన గొడ్డల మంగలి గోపాల్ అనే వ్యక్తి రోడ్డుపై సెప్టిక్ ట్యాంక్ నిర్మించినట్లు ఫిర్యాదు రాగానే నిర్మాణం ఆపాలని నోటీసులు జారీ చేశాం. అయితే అతను నిర్మాణం పూర్తి చేశాడని తెలిసింది. ఈ రోజే టీపీఓ జాయిన్ అయ్యారు. టీపీఓతో ఆ నిర్మాణ స్థలం వద్ద విచారణ జరిపి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణాన్ని తొలగిస్తాం".

Post a Comment

أحدث أقدم