Top News

Husband's Murder | భర్త హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్

భర్త హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్

ప్రమాదంగా చిత్రీకరించిన కుట్ర బట్టబయలు  

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పక్కా ప్లాన్‌తో హత్య  

సదాశివనగర్ పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు వెల్లడి  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 10: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను దారుణంగా హత్య చేసి దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య, ఆమె ప్రియుడిని సదాశివనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలను ఎల్లారెడ్డి డీఎస్పీ  ఎస్. శ్రీనివాస్ రావు వెల్లడించారు.  

ప్రమాదంగా ఫిర్యాదు

తేదీ 22-05-2026 న మర్కల్ గ్రామానికి చెందిన కంచర్ల రేణుక తన భర్త కంచర్ల రాజయ్య (45) రాత్రి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుండగా గుర్తు తెలియని జంతువు అడ్డురావడంతో బైక్ అదుపు తప్పి పడిపోయి మృతి చెందాడని సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  (Press Meet Video 👇)


పోలీసుల అనుమానం  

జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర  ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. సాక్షుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, పోస్టుమార్టం నివేదికను క్షుణ్ణంగా పరిశీలించగా ఇది ప్రమాద మరణం కాదని, తలపై బలంగా కొట్టడం వల్ల జరిగిన పక్కా ప్రణాళికాబద్ధమైన హత్యగా ప్రాథమికంగా నిర్ధారించారు.  

నాలుగేళ్ల అక్రమ సంబంధం

దర్యాప్తులో భాగంగా మర్కల్ గ్రామానికి చెందిన వ్యవసాయదారుడు కంచర్ల గంగశేఖర్ (37) ను అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి భార్య రేణుకతో గంగశేఖర్‌కు గత నాలుగు సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త రాజయ్య అడ్డుగా ఉన్నాడని భావించడంతో పాటు, అతను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులను పొందవచ్చనే దురాశతో ఇద్దరూ కలిసి రాజయ్యను హతమార్చాలని కుట్ర పన్నారు.  

మద్యం తాపించి హత్య 

ఈ కుట్రలో భాగంగా 21-05-2026 న గంగశేఖర్ ముందస్తు ప్రణాళికతో ఐరన్ రాడ్ తీసుకొని వెళ్లి, రాజయ్యను గాంధారి ప్రాంతానికి పిలిపించి మద్యం తాపించి మత్తులోకి నెట్టాడు. అనంతరం తిర్మన్‌పల్లి గ్రామ శివారులో రాత్రి వేళ మత్తులో ఉన్న రాజయ్య తలపై ఐరన్ రాడ్‌తో బలంగా కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఘటనను రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించేందుకు మృతదేహం, మోటార్ సైకిల్‌ను అక్కడే అమర్చి పరారయ్యాడు.  

సాక్ష్యాధారాలు స్వాధీనం

పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అతని సమాచారం మేరకు హత్యకు ఉపయోగించిన ఐరన్ రాడ్, మృతుడి మోటార్ సైకిల్, నిందితుల మొబైల్ ఫోన్లు, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

నిందితుల వివరాలు 

A1 – కంచర్ల గంగశేఖర్ (ప్రియుడు)  

A2 – కంచర్ల రేణుక (భార్య)  

నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచినట్లు డీఎస్పీ తెలిపారు.  

దర్యాప్తు బృందానికి అభినందనలు 

ప్రారంభంలో రోడ్డు ప్రమాదంగా కనిపించిన ఈ కేసును అత్యంత సూక్ష్మంగా దర్యాప్తు చేసి అసలు నిజాన్ని వెలికితీసిన సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్‌ఐ పుష్ప రాజు, ఎస్‌ఐ సిద్ధిక్, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ వెల్లడించారు.

Post a Comment

أحدث أقدم