మ్యూల్ అకౌంట్స్ తో సైబర్ నేరాలు
సైబర్ నిందితులకు సహకరిస్తున్న ఐదుగురు అరెస్టు
రూ.8.18 కోట్ల లావాదేవీలు
రెండేళ్లుగా తతంగం
తెలంగాణ డైలీ న్యూస్, నిర్మల్:
కష్టపడకుండా డబ్బు సంపాదించాలన్న ఆశతో తమ బ్యాంకు ఖాతాలు సైబర్ నేరగాళ్లకు ఇచ్చి సహకరించిన ఐదుగురిని నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో రూ. 8.18 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎస్పీ జానకి షర్మిల మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. జిల్లాలోని లోకేశ్వరం, సోన్ మండలాలకు చెందిన ఐదుగురిలో లోకేశ్వరం మండలానికి చెందిన ముగ్గురు
నిమ్మ గజేందర్, మగ్గిడి నవీన్, మగ్గిడి మహేందర్ లు ఇప్పటికే అరెస్టయ్యారు. సోన్ మండలానికి చెందిన మేకల నిఖిల్, షికారి సాయి క్రిష్ణపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. నిందితులు 2024 నుంచి తమ పేర్లతో, వ్యాపార సంస్థల పేర్లతో వివిధ బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలు ప్రారంభించి వాటి వివరాలను సైబర్ నేర ముఠాలకు అందజేశారు. ఆ ముఠా ఆన్‌లైన్ మోసాలతో డబ్బును ఈ ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపారు. ఇందుకు ప్రతిఫలంగా నిందితులకు కమీషన్లు అందాయి. వీరిలో నిమ్మ గజేందర్‌పై 9, మగ్గిడి నవీన్‌పై 28, మగ్గిడి మహేందర్‌పై 5, మేకల నిఖిల్‌పై 16, షికారి సాయి కృష్ణపై 6 సైబర్ ఫిర్యాదులు ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో నమోదయ్యాయి. నిమ్మ గజేందర్‌కు చెందిన ఆర్ వి ట్రేడర్ ద్వారా రూ.2.69 కోట్లు, మగ్గిడి నవీన్ కు చెందిన అజాన్ ట్రేడర్స్ ద్వారా సుమారు రూ.2.11 కోట్లు, మగ్గిడి మహేందర్ ఎన్ ఆర్ ట్రేడర్స్ ద్వారా సుమారు రూ. 91.36 లక్షలు, మేకల నిఖిల్‌కు చెందిన హెచ్ ఆర్ ఆటోమొబైల్స్ ద్వారా రూ.1.18 కోట్లు, షికారి సాయి కృష్ణకు చెందిన హెచ్ ఎన్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా రూ1.28 కోట్ల లావాదేవీలు, రూ.3.84 కోట్లకు పైగా నగదు చలామణి జరిగినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డబ్బు ఆశతో తమ బ్యాంకు వివరాలను ఇతరులకు అప్పగించవద్దని హెచ్చరించారు. ఈ కేసులో కృషి చేసిన భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డిఎస్పీ శ్రీనివాస్, ముధోల్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్, సోన్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకట రమణ,ఎస్ఐ లు గోపి, అశోక్, సిబ్బందిని అభినందించారు.

إرسال تعليق