బాన్సువాడ ఆసుపత్రిలో సిజేరియన్ వికటించి 5 బాలింతల అస్వస్థత
ప్లేట్లెట్స్ పడిపోవడం, కిడ్నీ, మూత్ర ఇన్ఫెక్షన్ లక్షణాలు
ఆందోళనలో బాలింతల కుటుంబాలు
నిజామాబాద్ తో ఉండి పర్యవేక్షస్తున్న సూపరింటెండెంట్
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: బాన్సువాడలోని మాతా శిశు ఆసుపత్రిలో శుక్ర, శనివారాల్లో చేసిన సిజేరియన్ ఆపరేషన్లు వికటించడంతో ఐదుగురు బాలింతలు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలంగాణ డైలీ న్యూస్ పాఠకులకు తెలిసిందే. ఈ ఘటనతో ఆసుపత్రిలో కలకలం రేగింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ నిర్లక్ష్యం లేదా మత్తు డాక్టర్ అదిక మత్తు ఇవ్వడం వలన కూడా జరిగే అవకాశం ఉందని నిజామాబాద్ వైద్యులు పేర్కొన్నారని తెలిసింది.
10 సిజేరియన్లలో 5 గురికి సమస్య
బాన్సువాడ ఏరియా ఆసుపత్రి పరిధిలోని మాతా శిశు ఆసుపత్రిలో గత శుక్ర, శనివారాల్లో మొత్తం 10 మంది గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు నిర్వహించారు. వారిలో శనివారం ఆపరేషన్ అయిన ఐదుగురి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. ఆపరేషన్ అనంతరం వారిలో ప్లేట్లెట్స్ అసాధారణంగా పడిపోవడం, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్, కిడ్నీల్లో సమస్యలు తలెత్తడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
జిల్లా ఆసుపత్రి నుంచి నిమ్స్ కు రిఫర్
విషయం తెలుసుకున్న వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయభాస్కర్ స్పందించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురు బాలింతలను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందుతుండగా, పరిస్థితి మరింత విషమించడంతో నిజామాబాద్ వైద్యులు ఐదుగురిలో ముగ్గురిని హైదరాబాద్ నిమ్స్ కు తరలించాలని సూచించారు.
సిజేరియన్ తర్వాత చికిత్స పొందుతున్న రోగుల వివరాలు:
_1) హుమెరా ఫాతిమా_
గ్రామం: యెల్లారెడ్డి
వ్యాధి: HBP, DSB, అధిక రక్తపోటు, థ్రోంబోసైటోపీనియా
_2) లక్ష్మి ప్రియ_
గ్రామం: బాన్సువాడ
వ్యాధి: ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది
_3) సునీత_
గ్రామం: బండపల్లి - పిట్లం
వ్యాధి: ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, థ్రోంబోసైటోపీనియా
_4) రుక్సానా_
గ్రామం: కొత్తాబాది - బాన్సువాడ
వ్యాధి: థ్రోంబోసైటోపీనియా, మూత్రం తగ్గుదల
_5) జ్యోతి_
గ్రామం: గౌరారం - గాంధారి
వ్యాధి: థ్రోంబోసైటోపీనియా, మూత్రం తక్కువగా రావడం
బంధువుల ఆందోళన
ఒకేసారి ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురి కావడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ చేసిన వైద్యురాలు అనుభవజ్ఞురాలే అయినా ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తున్నారు. సిజేరియన్ సమయంలో ఏదైనా నిర్లక్ష్యం జరిగిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ నిర్లక్ష్యం లేదా మత్తు డాక్టర్ అదిక మత్తు ఇవ్వడం వలన కూడా జరిగే అవకాశం ఉందని నిజామాబాద్ వైద్యులు పేర్కొన్నారని తెలిసింది. ప్రస్తుతం వారిని నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు రిఫర్ చేయడం పట్ల వారు మరింత ఆందోళన చెందుతున్నారు.
విచారణ జరుపుతున్నాం: సూపరింటెండెంట్
ఈ విషయంపై సూపరింటెండెంట్ డా. విజయభాస్కర్ తెలంగాణ డైలీ న్యూస్ తో మాట్లాడుతూ, "ఐదుగురు బాలింతలు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.వారి ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఇలా ఎందుకు జరిగిందో అనే కోణంలో విచారణ జరుపుతున్నాం. మెరుగైన వైద్యం కోసం వారిని నిజామాబాద్‌కు రిఫర్ చేశాం. ప్రస్తుతం నేను నిజామాబాద్ లో ఉండి పర్యవేక్షిస్తున్నాను" అని తెలిపారు. ఘటనపై ఉన్నతాధికారులు కూడా సమాచారం సేకరిస్తున్నారు.

إرسال تعليق