#ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడి ప్రాణాలు నిలిపిన పోలీసులు
#డయల్ 100 కాల్‌కు తక్షణ స్పందన
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి క్రైమ్ :
రాజంపేట మండలం బసవన్నపల్లి గ్రామంలో విషాదం తృటిలో తప్పింది. క్షణికావేశంలో ఆత్మహత్యకు యత్నించిన ఒక వ్యక్తిని పెట్రోలింగ్ పోలీసులు తమ సమయస్ఫూర్తితో ప్రాణాలతో కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు.
బసవన్నపల్లి గ్రామానికి చెందిన బచ్చన్ గారి నర్సింహులు అనే వ్యక్తి మద్యం మత్తులో తన భార్యతో గొడవపడి, మనస్తాపంతో గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. టవల్‌తో ఉరివేసుకుని చనిపోతానని బెదిరిస్తూ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సమాచారం అందగానే “డయల్ 100” ద్వారా అప్రమత్తమైన నైట్ పెట్రోలింగ్ సిబ్బంది కానిస్టేబుల్ జె. శ్రీనివాస్, హోం గార్డ్ రాజిరెడ్డి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సమయస్ఫూర్తితో రక్షణ:
వాటర్ ట్యాంక్‌పై ఉరివేసుకునేందుకు సిద్ధంగా ఉన్న నర్సింహులును చూసిన పోలీసులు ప్రాణాలకు తెగించి ట్యాంక్‌పైకి ఎక్కారు. ఉరివేసుకుంటున్న తరుణంలోనే అతడిని పట్టుకుని చాకచక్యంగా కిందకు దించి సురక్షితంగా రక్షించారు. అనంతరం అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి, క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సమయానికి స్పందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన పీసీ శ్రీనివాస్, హోం గార్డ్ రాజిరెడ్డిల ధైర్యసాహసాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.
“విపత్కర పరిస్థితుల్లో డయల్ 100కు సమాచారం ఇస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారని ఈ ఘటన మరోసారి నిరూపించింది” అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

Post a Comment