•ప్రపంచ మలేరియా దినోత్సవం
•నిజామాబాద్‌లో అవగాహన ర్యాలీ
తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్, ఏప్రిల్ 25:
నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ బి. రాజశ్రీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
వీధుల గుండా సాగిన ర్యాలీలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొని ‘దోమలు పుట్టొద్దు, దోమలు కుట్టొద్దు’, ‘ఫ్రైడే డ్రై డే’, ‘చిన్న ప్రాణులు పెద్ద ప్రమాదం’, ‘మనందరి పంతం మలేరియా అంతం’, ‘నీటి నిల్వలను తొలగించండి’, ‘దోమతెరలను వాడండి’ అంటూ నినాదాలు చేస్తూ తిరిగి పట్టణ ఆరోగ్య కేంద్రం వద్దకు చేరుకొని అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డా. రాజశ్రీ మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది “మలేరియాను అంతం చేసే దిశగా కృషి, ఇప్పుడు మనం చేయగలం, ఇప్పుడు మనం తప్పక చేయాలి” అనే నినాదంతో ఏడాది పొడవునా మలేరియా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రత పాటించాలని, కుండీలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ గ్లాసుల్లో నీరు నిల్వకుండా జాగ్రత్త పడాలని కోరారు. కిటికీలు, డోర్లకు దోమతెరలు వాడాలని, మున్సిపల్, గ్రామపంచాయతీ నల్లాలకు ఆన్-ఆఫ్ టూటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
గత ఐదేళ్లుగా జిల్లాలో మలేరియా కేసు నమోదు కాలేదని, అయితే డెంగ్యూ లాంటి దోమల ద్వారా వ్యాపించే ఇతర వ్యాధులు నమోదవుతున్నాయని, వాటి నివారణకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశాలు గృహ సందర్శనలో జ్వర సర్వే నిర్వహించి రక్తపూతలను పకడ్బందీగా సేకరించాలని, కేసు నమోదైతే 100 ఇళ్ల వరకు యాంటీ లార్వల్ స్ప్రే, కాంటాక్ట్ రక్త పూతల సేకరణ చేయాలని ఆదేశించారు. ‘ఫ్రైడే డ్రైడే’ను పకడ్బందీగా అమలు చేయాలని, పంచాయతీరాజ్, మున్సిపల్, ఇతర శాఖల సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. సికందర్ నాయక్, మెడికల్ ఆఫీసర్ డా. శ్రీలత, ఏఎంఓ సలీం, డిహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, హెచ్ఈఓలు వెంకట్ రవి, గోవర్ధన్, నాగరాజు, లింభారెడ్డి, రవి చందర్, పిహెచ్ఎన్ సుకన్య, కిషన్, అశోక్, మధుసూదన్, శాంతకుమారి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


Post a Comment