యూరియా కొరత లేకుండా కేంద్రాల్లో తగిన స్టాక్ ఉంచాలి
రైతులకు యాప్‌పై అవగాహన కల్పించాలి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 20: జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా అన్ని ఎరువుల విక్రయ కేంద్రాల్లో తగిన నిల్వలు ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్, సహకార శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాకాల సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన యూరియా, ఇతర ఎరువులు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎరువుల సరఫరా, నిల్వలు, పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడా కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని తెలిపారు. రైతులు ఎరువుల లభ్యత, పంపిణీ వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వ యాప్‌పై గ్రామ స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు, మార్క్‌ఫెడ్ ప్రతినిధులు, సహకార శాఖ అధికారులు పాల్గొన్నారు.
----------------------------------
ఇందిరమ్మ ఇళ్ల అమలులో కామారెడ్డి జిల్లా విశిష్ట ప్రగతి
_గ్రౌండింగ్‌లో రాష్ట్రంలో 2వ స్థానం, మంజూరులో 4వ స్థానం_
_పూర్తయిన ఇళ్ల నిర్మాణాలు, చెల్లింపుల్లో 8వ స్థానం_
కామారెడ్డి, జూన్ 20: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో కామారెడ్డి జిల్లా రాష్ట్ర స్థాయిలో విశిష్ట ప్రగతిని నమోదు చేసుకుంది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నాయకత్వంలో, నిరంతర పర్యవేక్షణతో జిల్లా పలు విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచింది.
జిల్లా సాధించిన ప్రగతి
- *మంజూరు*: జిల్లాలో మొత్తం 12,090 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, రాష్ట్రంలో 4వ స్థానం.
- *గ్రౌండింగ్*: 10,945 ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తి చేసి 90.52% ప్రగతితో రాష్ట్రంలో 2వ స్థానం.
- పూర్తయిన నిర్మాణాలు: 6,077 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, రాష్ట్రంలో 8వ స్థానం.
- *చెల్లింపులు*: ఇప్పటికే లబ్ధిదారులకు రూ.238.77 కోట్లు విడుదల చేసి, చెల్లింపుల పురోగతిలో 8వ స్థానం.
గృహ నిర్మాణాలకు ఆర్థిక సహకారంగా 2,365 మంది లబ్ధిదారులకు రూ.31.97 కోట్లు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందజేశారు. బ్యాంకుల సహకారంతో మరింత మందికి రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇందిరమ్మ ఇళ్ల ఫేజ్–2 అమలుకు ముందస్తు సన్నాహాలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను నిర్దేశిత గడువులో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులకు సూచించారు.

إرسال تعليق