![]() |
| బాన్సువాడలో టెంట్లు వేసి చేపలు విక్రయిస్తున్న దృశ్యం |
మృగశిర కార్తె రోజు చేపలకు ఫుల్ డిమాండ్
పెరిగిన ధరలు
ఆరోగ్య రీత్యా మృగశిర కార్తెకు చేపలు తినే సంప్రదాయం
మృగశిర కార్తె విశిష్టత ఏమిటి?
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: జూన్ 7న మృగశిర కార్తె కావడంతో ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చేపల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద, భీంగల్ ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో మత్స్యకారులు చేపలను విక్రయిస్తుండగా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
ఒక్కసారిగా పెరిగిన ధరలు
డిమాండ్ పెరగడంతో చేపల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సాధారణ రోజుల్లో కిలో రూ.120 నుంచి రూ.140 వరకు లభించే మామూలు చేపలు ప్రస్తుతం రూ.180 నుంచి రూ.200 వరకు పలుకుతున్నాయి. అలాగే మొట్ట చేపలు కిలో రూ.500 నుంచి రూ.700 వరకు విక్రయిస్తున్నారు. (Video 👇)
మృగశిర కార్తె విశిష్టత ఏమిటి?
మృగశిర కార్తె జూన్ 7 నుంచి ప్రారంభమవుతుంది. ఇది వర్షాకాల ఆరంభానికి సూచన. ఈ కార్తెలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారి తొలకరి జల్లులు పడతాయి. రైతులు ఈ కార్తెను వ్యవసాయ పనులకు శుభారంభంగా భావిస్తారు.
ఈ రోజు చేపలు ఎందుకు తినాలి?
మృగశిర కార్తె రోజు చేపలు తినడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.
1. రోగనిరోధక శక్తి: వర్షాకాలం ప్రారంభంలో వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువ. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్-D రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
2. ఉష్ణోగ్రతల సమతుల్యం: ఎండాకాలం తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుంది. శరీరాన్ని ఆ వాతావరణానికి తట్టుకునేలా చేపలు శక్తినిస్తాయని పెద్దలు నమ్ముతారు.
3. జీర్ణశక్తి: వర్షాకాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. చేపలు సులభంగా జీర్ణమవుతాయి.
మత్స్యకారులకు కాసుల పంట
మృగశిర కార్తె సందర్భంగా చేపలకు డిమాండ్ పెరగడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల ముందు నుంచే చెరువులు, కుంటల్లో చేపల వేట మొదలుపెట్టారు. జిల్లాలోని నిజాంసాగర్, పోచారం, రామడుగు, అలిసాగర్ ప్రాజెక్టులతో పాటు పలు చెరువుల నుంచి పెద్దఎత్తున చేపలు మార్కెట్‌కు వస్తున్నాయి.
ఒక్క రోజులోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల క్వింటాళ్ల చేపలు అమ్ముడుపోతాయని వ్యాపారులు చెబుతున్నారు.





Post a Comment