మాచారెడ్డి పోలీసుల చాకచక్యంతో నిందితుడి ఆటకట్టు
రెండు తెలుగు రాష్ట్రాల్లో వృద్ధులను టార్గెట్ చేసిన కేటుగాడు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 15: సహాయం చేసే నెపంతో వృద్ధులు, అమాయకుల ATM కార్డులు మార్చి లక్షలు కాజేస్తున్న అంతర్రాష్ట్ర మోసగాడిని మాచారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
కేసు వివరాలను కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ సోమవారం వెల్లడించారు. లచ్చపేట గ్రామానికి చెందిన రైతు ఎర్రోళ్ల నర్సింలు (53) కొత్త ATM కార్డుకు PIN జనరేట్ చేసుకునేందుకు మాచారెడ్డి SBI ATM కు వెళ్లాడు. ATM వినియోగం తెలియకపోవడంతో పక్కనే ఉన్న వ్యక్తి సహాయం తీసుకున్నాడు. అవకాశంగా భావించిన నిందితుడు రైతు కార్డును మార్చి వేరొక కార్డు ఇచ్చి మోసగించాడు. అనంతరం ఎల్లారెడ్డిపేట, కూకట్‌పల్లి ATM లలో బాధితుడి ఖాతా నుంచి విడతలవారీగా రూ.49,000 డ్రా చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS ఆదేశాలతో డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, మాచారెడ్డి ఎస్‌ఐ అనిల్, సీసీఎస్ బృందం మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో గాలింపు చేపట్టారు.
ఆదివారం మాచారెడ్డి చౌరస్తా SBI ATM వద్ద మళ్లీ మోసానికి యత్నించేందుకు వచ్చిన నిందితుడు, వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంటాడి పట్టుకున్నారు. నిందితుడిని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సీపాల ఈశ్వరయ్య @ ఈశ్వర్ @ శివ (30)గా గుర్తించారు. ప్రస్తుతం గచ్చిబౌలి, హైదరాబాద్‌లో ఉంటూ రాపిడో బైక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
విచారణలో నిందితుడు పలు నేరాలను అంగీకరించాడు. మాచారెడ్డిలో రూ.49,000, కామారెడ్డి యూనియన్ బ్యాంక్ ATM వద్ద రూ.90,600, వైఎస్సార్ కడప జిల్లా వెంపల్లిలో SBI ATM వద్ద రూ.30,000, నిజామాబాద్ జిల్లాలో ఒక వృద్ధురాలి ఖాతా నుంచి రూ.10,000 అక్రమంగా డ్రా చేసినట్లు తెలిపాడు.నిందితుడి నుంచి రూ.46,000 నగదు, VIVO V27 మొబైల్ ఫోన్, SBI ATM కార్డు స్వాధీనం చేసుకున్నారు. గతంలో తూప్రాన్‌లో 3, రామాయంపేట, జనగాం, షాబాద్, సంగారెడ్డి, RGI ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్లలో ఒక్కో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రమన్, ఎస్‌ఐ అనిల్, సీసీఎస్ ఎస్‌ఐ ఎం.డి. ఉస్మాన్, సిబ్బంది శ్రావణ్, శ్రీకాంత్, రాజవీరు, జి. లక్ష్మీకాంత్, రవి, చేతన్, ఐటీ కోర్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


إرسال تعليق