దోమకొండ సంక్షేమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి, కలెక్టర్
విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన విజయేంద్ర, ఆశిష్ సాంగ్వాన్
పోషకాహారం, దోమతెరలు, యూనిఫాంలపై ప్రత్యేక దృష్టి
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: దోమకొండ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను జిల్లా ప్రత్యేక అధికారి బి. విజయేంద్ర, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన అధికారులు, పాఠశాలలో విద్య, వసతి, ఆహారం, ఇతర సౌకర్యాలపై విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థినులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారా అని అధికారులను ప్రశ్నించారు. వర్షాకాలంలో దోమల బెడద నేపథ్యంలో ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా దోమతెరలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యూనిఫాం వస్త్రం అందిన వెంటనే కొలతలు తీసి కుట్టించి అందించాలని సూచించారు.
జిల్లాలో బాల్య వివాహాలు జరుగుతున్నాయా అని ఆరా తీస్తూ, అలాంటి ఘటనలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
భోజనం చేస్తున్న విద్యార్థినులకు పోషకాహారం ప్రాముఖ్యతను వివరించిన కలెక్టర్, అన్నం తక్కువగా, కూరలు, ఆకుకూరలు, పప్పు, గుడ్లు వంటి పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలని, వడ్డించిన కూరలను వృథా చేయకుండా పూర్తిగా తినాలని సూచించారు. ఉపాధ్యాయులు, వార్డెన్లు ప్రత్యేకంగా పర్యవేక్షించి ప్రతి విద్యార్థి సరైన మోతాదులో పోషకాహారం తీసుకునేలా చూడాలని ఆదేశించారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వసతి, మెరుగైన విద్యా వాతావరణం అందేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
అంతకుముందు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సమీక్ష సమావేశానికి విచ్చేసిన ప్రత్యేక అధికారి బి. విజయేంద్రకు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర పూలమొక్కతో స్వాగతం పలికారు.
-----------------------
ఆర్‌జీయూకేటీ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం
రెడ్ క్రాస్ ద్వారా చెక్కు అందజేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డుకాకూడదు: కలెక్టర్
కామారెడ్డి: ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదని, జిల్లా పరిపాలన ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.
శనివారం కలెక్టరేట్‌లో ఆర్‌జీయూకేటీ బాసర్‌లో విద్యనభ్యసిస్తున్న కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని నిఖితకు రూ.10,000 విలువైన చెక్కును కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అందజేశారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ విద్యా ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం కోరుతూ నిఖిత సమర్పించిన వినతిని పరిశీలించిన కలెక్టర్ వెంటనే స్పందించారు. ఈ సహాయం పుస్తకాలు, అధ్యయన సామగ్రి, ప్రయాణం తదితర విద్యా అవసరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు.
విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలో నిలిపివేయకుండా, పట్టుదలతో ఉన్నత విద్యను కొనసాగించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ ఆర్థిక సహాయం తన చదువును కొనసాగించేందుకు ఎంతో తోడ్పడుతుందని విద్యార్థిని నిఖిత కృతజ్ఞతలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాజన్న, నరసింహులు, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.





Post a Comment