Top News

1980's Trend | పాత ఫోటోల పేరుతో కొత్త సైబర్ మోసం - 80ల ఫోటో ఎడిటింగ్ పేరుతో టోకరా

పాత ఫోటోల పేరుతో కొత్త సైబర్ మోసం - 80ల ఫోటో ఎడిటింగ్ పేరుతో టోకరా

అప్రమత్తంగా ఉండాలని టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 80s లుక్ వెనుక బిగ్ ట్రాప్

(తెలంగాణ డైలీ న్యూస్ క్రైమ్ బ్యూరో✍️)

సోషల్ మీడియాలో ప్రస్తుతం `1980s రెట్రో ఫోటో ఎడిటింగ్` ట్రెండ్ దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ChatGPT, Gemini తో మీ ఫోటోను 80s బాలీవుడ్ హీరో, రెట్రో చీరకట్టు, పాత స్టూడియో స్టైల్ లోకి మార్చుకోవడం ట్రెండింగ్ గా మారింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు నుంచి క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వరకు అందరూ ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.

ఈ క్రేజ్ ను సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) శనివారం అధికారిక హెచ్చరిక జారీ చేసింది. 

ఎలా మోసం చేస్తున్నారు?

- ఉచితంగా 1980s ఫోటో ఎడిటింగ్ అంటూ ఆకర్షణీయమైన యాడ్స్, వాట్సాప్ మెసేజ్ లు పంపుతున్నారు.

- లింక్ పై క్లిక్ చేయగానే అధికారిక ప్లే స్టోర్ కు బదులుగా అనుమానాస్పద వెబ్ సైట్ల నుంచి APK ఫైళ్లు డౌన్ లోడ్ చేయిస్తున్నారు.

- ఆ యాప్ ఇన్ స్టాల్ చేసిన వెంటనే మీ ఫోన్ లోని SMS, OTPలు, కాంటాక్ట్స్, బ్యాంకింగ్ వివరాలు, నోటిఫికేషన్లకు పర్మిషన్ అడుగుతుంది. ఆ డేటాతో ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఐడెంటిటీ తెఫ్ట్ చేస్తున్నారు. 

కర్ణాటకలోని బెంగళూరు పోలీసులు, మదనాయకనహళ్లి పోలీసులు కూడా ఇదే తరహా హెచ్చరిక చేశారు. హై-రిజల్యూషన్ సెల్ఫీలతో బయోమెట్రిక్ డేటా దొంగిలించి డీప్ ఫేక్ వీడియోలు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

1980 ట్రెండ్ ఫాలో అయిన నిజామాబాద్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్ పాల్, రాకేష్ రెడ్డి 👆
సేఫ్ గా ట్రెండ్ ఫాలో అవ్వాలంటే TGCSB సూచనలు:

1980ల నాటి రెట్రో ఫోటోలుగా సాధారణ ఫోటోలను మార్చుకునే ట్రెండింగ్ సైబర్ నేరగాళ్లు మోసాలకు ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్బీ) హెచ్చరించింది.

ఆకర్షణీయమైన ప్రకటనలు, సందేశాల ద్వారా ఉచితంగా లేదా అపరిమితంగా రెట్రో ఫోటో ఎడిటింగ్ సదుపాయం అందిస్తామంటూ ప్రజలను సైబర్ నేరగాళ్లు ఆకర్షిస్తున్నారని తెలిపింది. ఈ మేరకు టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

సదరు ప్రకటనలు, సందేశాల్లోని అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయించి అధికారిక యాప్ స్టోర్లకు బదులుగా ఇతర వెబ్ సైట్ల నుంచి హానికర ఏపీకే ఫైళ్లను డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. యాప్ లను ఇన్ స్టాల్ చేశాక అవసరానికి మించి అనుమతులు కోరుతూ మొబైల్ లోని సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉందని తెలిపారు.

ఏయే సమాచారం చోరీ అయ్యే అవకాశం ఉంది?

హానికరమైన యాప్ ల ద్వారా ఎస్ఎంఎస్ లు, ఓటీపీలు, కాంటాక్టులు, వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్, ఆర్థిక వివరాలు, నోటిఫికేషన్లు, డివైస్ కు సంబంధించిన సమాచారం, మొబైల్ లో భద్రపరిచిన ఇతర సున్నితమైన సమాచారం చోరీ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సమాచారాన్ని ఉపయోగించి ఆర్థిక మోసాలు, అనధికారిక లావాదేవీలు, ఐడెంటిటీ తెఫ్ట్ వంటి సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది.

సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని, http://cybercrime.gov.in పోర్టల్ లేదా 8712672222 సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ వాట్సాప్ నంబర్ ద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చని డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు.

టీజీ సీఎస్బీ సూచనలు:

- వాట్సాప్, ఇతర సోషల్ మీడియా తదితర మార్గాల్లో వచ్చే తెలియని లేదా అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దు. తెలియని వ్యక్తులు లేదా అనుమానాస్పద పనుల నుంచి ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైళ్లను డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేయవద్దు.

- యాప్ లను అధికారిక, విశ్వసనీయ యాప్ స్టోర్ల నుంచే డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఇన్ స్టాల్ చేసే ముందు అది కోరుతున్న పర్మిషన్లను జాగ్రత్తగా పరిశీలించాలి.

- ఓటీపీలు, పిన్ నంబర్లు, పాస్ వర్డ్ లు, బ్యాంకింగ్ వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. అనుమానాస్పదంగా అనిపించే యాప్ ను వెంటనే అన్ ఇన్ స్టాల్ చేసి, అవసరమైతే అనుమతులను రద్దు చేయాలి. మొబైల్ ఓఎస్, యాప్ లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి.

Post a Comment

Previous Post Next Post