Top News

Railway Over Bridge | కామారెడ్డిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి ఎఫెక్ట్...!

కామారెడ్డిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి ఎఫెక్ట్.. 300 మధ్యతరగతి కుటుంబాల గోస

ఏకమవుతున్న పలు కాలనీల వాసులు 

బ్రిడ్జి వద్దంటూ కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఫిర్యాదుకు సిద్ధమవుతున్న బాధితులు 

కామారెడ్డి బ్యూరో, సెప్టెంబర్ 09:

అభివృద్ధి పేరుతో చేపట్టే నిర్మాణాలు కొందరికి వరంగా మారితే, మరికొందరికి శాపంగా మారుతున్నాయి. కామారెడ్డి పట్టణంలోని రైల్వే గేటు (209/A) వద్ద ప్రతిపాదించిన ఓవర్ హెడ్ బ్రిడ్జి (ROB) నిర్మాణం విషయంలో 300 మధ్యతరగతి కుటుంబాల ఆందోళన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరుగుతోంది?

కామారెడ్డి పట్టణం అశోక్ నగర్ కాలనీ, స్నేహపురి కాలనీ, కెపిఆర్ కాలనీ వాసులు ప్రస్తుతం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మార్కింగ్ పూర్తి: రైల్వే అధికారులు అశోక్ నగర్ రోడ్డుకు ఇరువైపులా స్థల సేకరణకు మార్కింగ్ వేశారు. ప్రస్తుతం ఉన్న రోడ్డును విస్తరించేందుకు గేటు నుంచి అశోక్ నగర్ వైపు 15 ఫీట్ల నుంచి 20 ఫీట్ల వరకు కొలతలు వేశారు.

వందల ఇళ్లకు నష్టం: ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం తమ ఇండ్లు, ఖాళీ స్థలాలు, ప్లాట్ల స్వాధీన ప్రక్రియ జరుగుతోందని, ఇది జరిగితే దాదాపు 300 మధ్యతరగతి కుటుంబాలు ఇండ్లు, ప్లాట్లు కోల్పోయి రోడ్డున పడతామని కన్నీటి పర్యంతమవుతున్నారు. గేటు నుంచి ఇందిరా నగర్ రోడ్డు వరకు, అలాగే కెపిఆర్ కాలనీ వైపు కూడా భారీగానే నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు.

గతంలో స్నేహపురి కాలనీ, వికాస్ నగర్, పాతరాజంపేట వద్ద లేదా టెక్స్ టైల్ పార్క్ వద్ద బ్రిడ్జి నిర్మిస్తారని అంతా భావించారు. కానీ ఇటీవల అధికారులు జనావాసాల మధ్య ఉన్న అశోక్ నగర్ ప్రాంతంలోనే వంతెన నిర్మాణానికి నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది.


బాధితుల డిమాండ్:

జిల్లా కేంద్రంలో రైల్వే డబుల్ లైన్ పనులు కూడా త్వరలో మొదలుకానున్న నేపథ్యంలో, ఈ వంతెన నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇళ్లు, స్థలాలు కోల్పోయిన వారికి సరైన పరిహారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

అధికారులు తమ యందు దయ ఉంచి ఓవర్ బ్రిడ్జి ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, ఇళ్లు లేని ఖాళీ ప్రదేశంలో, తక్కువ నష్టం జరిగే ప్రత్యామ్నాయ స్థలంలో ఆరోబీ నిర్మించాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి.

ఈ మేరకు రైల్వే గేటు 209/A వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వాలని, పార్లమెంట్ సభ్యులు (జహీరాబాద్), శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి (కామారెడ్డి) లకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఆదివారం రాత్రి బాధిత కాలనీవాసులు అత్యవసరంగా సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

ఒకవైపు రైల్వే సమస్యకు పరిష్కారంగా బ్రిడ్జి అవసరమే అయినా, మరోవైపు 300 పేద, మధ్యతరగతి కుటుంబాలను నిరాశ్రయులను చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించకుండా ఉన్న ఇళ్ల మీదుగా బ్రిడ్జి నిర్మించడం సరికాదని వాపోతున్నారు.

ఆదివారం రాత్రి సమావేశమైన మూడు కాలనీల వాసులు 


ఇంటికి మార్కింగ్ వేసిన దృశ్యం 

రైల్వే ఓవర్ bridge మ్యాప్ 


Post a Comment

Previous Post Next Post