Top News

Mid Night Chasing | మిడ్‌నైట్ చేజింగ్‌లో దొరికిన వాహన దొంగలు

మిడ్‌నైట్ చేజింగ్‌లో దొరికిన వాహన దొంగలు  

గ్రామస్తుల అండతో పోలీసుల సినిమా తరహా ఆపరేషన్  

8 కిలోమీటర్ల ఉత్కంఠ వెంటాడి నలుగురిని అరెస్ట్ చేసిన నాగిరెడ్డిపేట్ పోలీసులు  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 06: అర్ధరాత్రి 8 కిలోమీటర్ల పాటు సాగిన ఉత్కంఠభరిత చేజింగ్‌తో నాగిరెడ్డిపేట్ పోలీసులు నలుగురు వాహన దొంగలను పట్టుకున్నారు. బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది పట్టుదలకు గ్రామస్తుల సహకారం తోడవడంతో ఈ ఆపరేషన్ విజయవంతమైంది.  వివరాలు:

జూన్ 3న దొంగిలించిన ఆటోతో చిక్కిన గ్యాంగ్  

కేసు వివరాల్లోకి వెళ్తే గోపాలపేటకు చెందిన మహమద్ సఫుద్దీన్‌కు చెందిన ఆటో TS17T0997 జూన్ 2 రాత్రి ఇంట్లో పార్క్ చేసి ఉండగా జూన్ 3 తెల్లవారుజామున 4 గంటలకు దొంగిలించబడింది. ఈ మేరకు నాగిరెడ్డిపేట్ పీఎస్‌లో http://Cr.No.108/2026 U/s 331(4), 305(b) BNS కింద కేసు నమోదైంది.  

2:30 గంటలకు మొదలైన బ్లూ కోల్ట్స్ అలర్ట్  

ఆపరేషన్ ఇలా సాగింది: జూన్ 6 రాత్రి 2:30 గంటలకు గోపాల్‌పేట్ బస్టాండ్ సమీపంలో బ్లూ కోల్ట్స్ సిబ్బంది అనుమానాస్పదంగా రెండు బైక్‌లపై తిరుగుతున్న వ్యక్తులను గుర్తించారు. ప్రశ్నించేందుకు ప్రయత్నించగా ఒక బైక్‌ను వదిలి ఇద్దరు మరో బైక్‌పై పరారయ్యారు. వెంటనే పెట్రో కార్ సిబ్బంది సురేష్, సుదర్శన్ చేజింగ్ ప్రారంభించారు.  

పోచారం నుంచి మాల్తుమ్మెద దాకా సినిమా స్టైల్ వెంటాట  

పోచారం వద్ద పెట్రో కార్‌ను అడ్డుపెట్టినా నిందితులు తప్పించుకుని ఎల్లారెడ్డి వైపు వెళ్లారు. సమాచారం అందుకున్న నాగిరెడ్డిపేట్ ఎస్ఐ భార్గవ్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగారు. మాల్తుమ్మెద గ్రామ గేటు వద్ద నిందితులు బైక్ వదిలి పొలాల్లోకి పారిపోయారు.  

టార్చ్‌లైట్లతో రంగంలోకి దిగిన గ్రామస్తులు  

ఉపసర్పంచ్ సమాచారంతో రాత్రి 3 గంటలకు గ్రామ యువకులు, గ్రామస్తులు టార్చ్‌లైట్లతో పోలీసులతో కలిసి గాలింపు చేపట్టారు. ఒత్తిడి తట్టుకోలేక నిందితులు తమ గ్యాంగ్‌లోని మరో ముగ్గురిని దొంగిలించిన ఆటోలో పోచారం చెరువు కట్టకు రప్పించారు. బ్లూ కోల్ట్స్ వెంటాడటంతో ఆటోను వదిలి మళ్లీ పొలాల్లోకి పరుగెత్తారు.  (Video 👇)


రెండు జిల్లాల సరిహద్దుల్లో పోలీసుల చక్రవ్యూహం  

నాగిరెడ్డిపేట్ ఎస్ఐ మెదక్ జిల్లా జక్కన్నపేట సర్పంచ్‌కు సమాచారం ఇవ్వడంతో గ్రామ ప్రవేశ మార్గాల్లో గ్రామస్తులు మోహరించారు. ముందు జక్కన్నపేట గ్రామస్తులు, వెనుక పోలీసులు, మాల్తుమ్మెద, పోచారం గ్రామస్తులు చుట్టుముట్టడంతో నిందితులు తిరిగి పోచారం వైపు వచ్చారు. వాహన తనిఖీల్లో పోలీసులు నలుగురిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఒకరు చీకట్లో తప్పించుకున్నాడు.  

43 కేసుల హిస్టరీ ఉన్న ప్రధాన నిందితుడు సహా ఐదుగురి గ్యాంగ్  

నిందితుల వివరాలు:  

A1 చింతా బాల్‌రాజ్ - 43 కేసులు గత చరిత్ర  

A2 షేక్ ఫయాజ్ - పరారీ, 37 కేసులు  

A3 డి. కార్తీక్ రెడ్డి - 3 కేసులు  

A4 ఆటి రమేష్ - 1 కేసు  

A5 CCL - 3 కేసులు  

6 జిల్లాల్లో నేరాలు చేసినట్లు అంగీకారం  

విచారణలో నిందితులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, మెదక్, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి జిల్లాల్లో గతంలో నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుంచి 2 ఆటోలు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.  

ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేక అభినందనలు  

ఆపరేషన్‌లో పాల్గొన్న ఎస్ఐ ఐ.ఏ. భార్గవ్ గౌడ్, పీసీ సురేష్ గౌడ్, ఏఆర్పీసీ సుదర్శన్, పీసీ వాజీద్‌తో పాటు సహకరించిన మాల్తుమ్మెద, పోచారం, జక్కన్నపేట గ్రామస్తులను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.  

పోలీసులు, ప్రజలు కలిసి పనిచేస్తే నేరస్తులు తప్పించుకోలేరని ఈ ఆపరేషన్ నిరూపించిందని ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలో పట్టుకుంటామన్నారు.

Post a Comment

Previous Post Next Post