Top News

MLA Madan Mohan | పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలి

పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలి  

వనమహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొనండి - ఎమ్మెల్యే మదన్ మోహన్ పిలుపు  

కామారెడ్డి జిల్లా అడవుల్లో పెద్దపులి సంచారం - డీఎఫ్ఓ రామకృష్ణ  

తెలంగాణ డైలీ న్యూస్, రామారెడ్డి: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ దిశగా ప్రజలందరూ చురుకుగా భాగస్వాములు కావాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పిలుపునిచ్చారు.  

99 రోజుల ప్రణాళికలో భాగంగా కార్యక్రమాలు  

సోమవారం రామారెడ్డి మండలంలోని రామారెడ్డి, గిద్ద గ్రామాల్లో నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జూన్ 1 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, వనమహోత్సవ మొక్కల నాటే కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.  

జిల్లాలో 2 లక్షల ఎకరాల అటవీ ప్రాంతం  

ఈ సందర్భంగా కామారెడ్డి డివిజన్ అటవీ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల అటవీ ప్రాంతం ఉందని, అందులో అనేక రకాల వృక్షజాలం, వన్యప్రాణులు ఉన్నాయని తెలిపారు. ఇటీవల పెద్దపులి కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు పేర్కొన్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ మనందరి బాధ్యత అని, వనమహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఇంటింటా మొక్కలు నాటాలని సూచించారు.  

ఔషధ మొక్కల ప్రదర్శన - మహిళా సంఘాలకు ఉపాధి  

అనంతరం లెమన్ గ్రాస్, కలబంద, ఇన్సులిన్ మొక్కలు తదితర ఔషధ మొక్కలను ప్రదర్శిస్తూ వాటి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. అలాగే మోదుగ విస్తరాకులు, ఇప్ప పూల సేకరణ ద్వారా టీ, ఇప్ప లడ్డూలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి గ్రామీణ మహిళా సంఘాలకు ఉపాధి, ఆదాయ వనరులు కల్పించవచ్చని తెలిపారు.  

ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు బండి ప్రవీణ్, మొగుళ్ల సరిత, మండల అభివృద్ధి అధికారి నాగేశ్వర్, ఎస్సై రాజశేఖర్, మండల పంచాయతీ అధికారి తిరుపతి రెడ్డి, ఏపీవో ధర్మారెడ్డి, అటవీ శాఖ అధికారులు ముబాషిర్, మమత, ఫరూక్, వేదాంతాచారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post