SP Visit | కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  

రికార్డులు, సిబ్బంది పనితీరు పరిశీలన, CCTNS అప్‌డేట్‌కు ఆదేశం  

రౌడీ షీటర్లు, కేడీలపై ప్రత్యేక నిఘా ఉంచాలి: ఎస్పీ రాజేష్ చంద్ర  

ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి సత్వర న్యాయం అందించాలి

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 18: జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర గురువారం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ పరిసరాలు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ సిబ్బంది పనితీరును ఆయన నిశితంగా పరిశీలించారు.

అనంతరం పోలీస్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమైన ఎస్పీ, రోల్ కాల్ ప్రాముఖ్యతను వివరించడంతో పాటు విధులు, బాధ్యతలపై ఆరా తీశారు. స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నాణ్యమైన దర్యాప్తు, CCTNS అప్‌డేట్‌కు ఆదేశం 

ప్రతి కేసులోనూ నాణ్యమైన దర్యాప్తు జరగాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. స్టేషన్‌కు సంబంధించిన అన్ని రికార్డులను నిర్ణీత గడువులోగా CCTNS పోర్టల్‌లో నమోదు చేసి, ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఆదేశించారు.



శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి

పట్టణంలో వాహనాల తనిఖీలు, నాకాబందీలు, ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తులు, వాహనాలపై గట్టి నిఘా ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, కేడీలు, పాత నేరస్థుల వివరాలపై ప్రతి సిబ్బందికీ పూర్తి అవగాహన ఉండాలని పేర్కొన్నారు. పగలు, రాత్రి సమయాల్లో బీట్‌లను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఆన్‌లైన్ రికార్డులను అప్‌డేట్ చేయాలన్నారు.

ప్రజల్లో అవగాహన పెంచాలి 

సైబర్ నేరాలు, ఆస్తి నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రత వంటి కీలక అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ పిలుపునిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింకులు, ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.

సిబ్బందికి సూచనలు  

విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, వృత్తిపరమైన నైపుణ్యంతో పనిచేయాలని, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా విని చట్టబద్ధంగా సత్వర పరిష్కారం చూపాలని ఎస్పీ ఆదేశించారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే కామారెడ్డి పోలీసుల ప్రథమ కర్తవ్యమని, నేర రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని కోరారు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి సమస్య ఎదురైనా తక్షణమే పోలీసులను ఆశ్రయించాలని, వారి రక్షణకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. “మీ భద్రత – మా బాధ్యత” అనే నినాదంతో ప్రజలకు మరింత చేరువగా, సమర్థవంతంగా సేవలందించేందుకు కామారెడ్డి పోలీసులు కట్టుబడి ఉన్నారని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.

Post a Comment

أحدث أقدم