కామారెడ్డిలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి: బీజేపీ కౌన్సిలర్ల డిమాండ్
మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పణ
చర్యలు తీసుకోకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరిక
కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:
పట్టణంలో అక్రమంగా నిర్మిస్తున్న, నిర్మించిన కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ కౌన్సిలర్లు బుధవారం కామారెడ్డి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలో గతంలో, ప్రస్తుతం యదేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా డివియేషన్ లేకుండా, సెల్లార్ అనుమతి లేకుండా, పార్కింగ్ సదుపాయం లేకుండా, నాలాలపై భవనాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. వీటి విషయంలో కొంత మంది చేతివాటం చూపి కట్టడాల నిర్మాణానికి సహకరిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ విషయంలో సరైన విచారణ చేపట్టి అక్రమ కట్టడాలపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు వివరించినట్లు తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరిగినా, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోకపోయినా బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
అలాగే చేతివాటం చూపే అధికారులు, రాజకీయ నాయకుల మాటలు నమ్మి నిర్మాణాలు చేపడితే తర్వాత జరిగే పరిణామాలకు యజమానులు బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

Post a Comment