కుళాయి నీటిని తాగడానికి వాడొద్దు - జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచన
శుభ్రమైన నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అధికారులకు కౌన్సిలర్ హకీం విజ్ఞప్తి
బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని 3వ వార్డు కౌన్సిలర్ హకీం సూచించారు.
బాన్సువాడ ప్రజలకు ప్రస్తుతం మున్సిపాలిటీ కుళాయిల ద్వారా సింగూర్ డ్యామ్ నుండి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే వర్షాల కారణంగా పలుచోట్ల పైపులు లీక్ అవ్వడంతో శుభ్రమైన నీరు సరఫరా కావడం లేదని కౌన్సిలర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కలుషిత నీటిని పౌరులు తాగడానికి వాడితే వారి ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండటంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. (కలుషిత నీటి వీడియో 👇)
అధికారులకు విజ్ఞప్తి:
పౌరుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడకుండా ప్రజలకు శుభ్రమైన తాగునీటిని సరఫరా చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని బాన్సువాడ మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరత అధికారులకు కౌన్సిలర్ హకీం విజ్ఞప్తి చేశారు. లీక్ అవుతున్న పైపులను వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు.
ప్రజలకు సూచనలు:
1. కుళాయిల ద్వారా సరఫరా అయ్యే నీటిని తాగడానికి ఉపయోగించవద్దు. ఇతర అవసరాలకు మాత్రమే వాడుకోవాలి.
2. తాగునీటి కోసం మంచినీటి ప్లాంట్లు లేదా క్యాన్ల నీటిని వాడాలి.
3. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
4. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తారని కౌన్సిలర్ హకీం ఆశాభావం వ్యక్తం చేశారు.


Post a Comment