Top News

Exise Supdt | సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై విచారణకు ఆదేశం

 

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై విచారణకు ఆదేశం  

రాజస్థాన్ యూట్యూబర్ తో గొడవ వ్యవహారం 

కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి సస్పెన్షన్‌కు నివేదిక - ఎక్సైజ్ ఎస్పీ ముకుంద రెడ్డి

కామారెడ్డి: సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద నిన్న సాయంత్రం చోటుచేసుకున్న వివాదంపై ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వెంటనే విచారణ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు.

ఘటన వివరాలు

రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ట్రక్కులో ప్రయాణిస్తున్న యూట్యూబర్ చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడిన సందర్భంగా వివాదం చోటుచేసుకుంది. ప్రాథమిక విచారణలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి పాత్రను గుర్తించినట్లు ఈఎస్ తెలిపారు.

శాఖాపరమైన చర్యలు

ఈ అంశంపై శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. విచారణ నివేదికను కరీంనగర్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, నోడల్ అధికారికి సమర్పించనున్నారు.

క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సదరు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ముకుంద రెడ్డి వెల్లడించారు.

ఎక్సైజ్ శాఖ స్పందన

అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం, గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సలబత్‌పూర్ చెక్‌పోస్ట్‌ను గత రెండు దశాబ్దాలుగా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన చెప్పారు. 

చెక్‌పోస్ట్‌లో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు చేపడుతున్నారని తెలిపారు.

ఈ ఘటనపై శాఖ ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించదని, విధి నిర్వహణలో నిబంధనలు, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బాధ్యులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి స్పష్టం చేశారు.

Post a Comment

Previous Post Next Post