PSR In Bonalu | బాన్సువాడలో ఘనంగా దుర్గామాత బోనాల ఉత్సవాలు

బాన్సువాడలో ఘనంగా దుర్గామాత బోనాల ఉత్సవాలు  

బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్న  పోచారం, కాసుల 

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు, సుభిక్షత కోసం అమ్మవారికి ప్రత్యేక పూజలు

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ సంగమేశ్వర కాలనీలో వెలసిన శ్రీ జోడ్ కనకదుర్గా దేవి ఆలయంలో ఆషాఢ మాస తొలి ఆదివారం బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో తలపై బోనాలు మోసుకుంటూ మొక్కులు చెల్లించారు. డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాలు, భక్తుల జైజైధ్వానాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

సభాపతి, ఆగ్రోస్ చైర్మన్ పాల్గొని పూజలు  

ఈ బోనాల ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్  కాసుల బాలరాజు  పాల్గొన్నారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి  స్వయంగా బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం దుర్గా మాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.












రాష్ట్ర సుభిక్షత కోసం ప్రార్థన

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించి సుభిక్షంగా ఉండాలని, బాన్సువాడ పట్టణ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.

ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు.

భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు 

బోనాల ఉత్సవాల నిర్వహణకు ఆలయ కమిటీ సభ్యులు, సంగమేశ్వర కాలనీ యువకులు, స్థానిక ప్రజలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు నోచుకున్నారు.

Post a Comment

Previous Post Next Post