Top News

SP Rajesh Chandra | సమయస్ఫూర్తి... మెరుపు స్పందన... నిలిచిన ఒక ప్రాణం


సమయస్ఫూర్తి... మెరుపు స్పందన... నిలిచిన ఒక ప్రాణం

డయల్-100 సమాచారం అందగానే ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన దోమకొండ పోలీసులు  

HC గంగయ్య, HG రాజులను అభినందించిన జిల్లా ఎస్పీ 

దోమకొండ: డయల్-100 పోలీసు సిబ్బంది సమయానికి స్పందించి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను కాపాడి, కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించిన ఘటన దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం, దోమకొండ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ గత కొంతకాలంగా కుటుంబ కలహాల కారణంగా తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద నివసిస్తోంది. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి లింగుపల్లి వైపు ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో వెళ్తుండగా, డయల్-100కు సమాచారం అందింది.

సమాచారం అందుకున్న వెంటనే పెట్రో కార్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ గంగయ్య, హోంగార్డ్ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను గుర్తించి సురక్షితంగా రక్షించారు. అనంతరం ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులతో మాట్లాడించి ఆమెను తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.

విధి నిర్వహణలో సమయస్ఫూర్తితో స్పందించి ఒక ప్రాణాన్ని కాపాడిన హెడ్ కానిస్టేబుల్ గంగయ్య, హోంగార్డ్ రాజులను జిల్లా ఎస్పీ అభినందించారు. ప్రజల ప్రాణాల రక్షణలో ఇదే సేవా స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, "ఆత్మహత్య ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కాదు. ఏ ఆపద వచ్చినా ఒంటరిగా మానసిక వేదన అనుభవించకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలి. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100కు సమాచారం ఇవ్వాలి. ప్రతి ప్రాణం అమూల్యమైనది" అని తెలిపారు.

-------------------------------


కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర

మానవీయంగా వ్యవహరించి సత్వర న్యాయం అందించాలి - ఎస్పీ

కామారెడ్డి: వార్షిక తనిఖీల్లో భాగంగా కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర, శుక్రవారం గురువారం క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై స్టేషన్‌లోని శాంతిభద్రతలు, నేర నియంత్రణ, దర్యాప్తు, పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. గతంలో ఎస్‌ఐలకు జారీ చేసిన ఆదేశాలు సిబ్బందికి చేరాయా లేదా అనే విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు.

స్టేషన్ ఆవరణలో స్వాధీనం చేసిన ద్విచక్ర వాహనాలు, రికార్డులు, రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారక్, మాల్ఖానా, టెక్నికల్ రూమ్ తదితర విభాగాలను పరిశీలించారు. రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలు, విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ తదితర అంశాలపై టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి నుంచి వివరాలు తెలుసుకున్నారు.

ఎస్పీ సూచనలు

1. బాధితుల పట్ల మానవీయ దృక్పథంతో, మర్యాదగా వ్యవహరించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.

2. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా, జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలి.

3. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండి రాత్రి గస్తీ, విజిబుల్ పోలీసింగ్‌ను మరింత ముమ్మరం చేయాలి.

4. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలి.

5. డయల్-100 కాల్స్‌పై వేగంగా స్పందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.

6. విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన, నిజాయితీ పాటిస్తూ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదగా, మానవీయంగా వ్యవహరించాలని ఆదేశించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని, స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి అవార్డులు, రివార్డులు అందజేస్తామని ప్రకటించారు. సిబ్బందికి వ్యక్తిగతంగా లేదా విధులపరంగా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి, ఎస్‌ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

-------------------------------


కామారెడ్డి జిల్లాలో ఆగస్టు నెలంతా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలపై నిషేధం: ఎస్పీ యం. రాజేష్ చంద్ర

కామారెడ్డి: జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు ఒక నెల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర ప్రకటించారు.

శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఎస్పీ మాట్లాడుతూ, ఈ నిబంధనల ప్రకారం పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లా వ్యాప్తంగా ఎవరూ ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

ప్రజా ధనానికి నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఈ నిబంధనల అమలుకు జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post