Top News

World Breast Feeding Week | అమ్మపాలు బిడ్డకు అమృతం!

అమ్మపాలు బిడ్డకు అమృతం!

తల్లిపాలు బిడ్డకు ప్రకృతి ప్రసాదించిన మొదటి టీకా

ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్బంగా ప్రత్యేక కథనం 

(చింతకింది సాయగౌడ్ - సీనియర్ జర్నలిస్ట్ ✍️)

ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు. తల్లిపాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలుపుతూ అపోహలను తొలగించడం ప్రతి నవజాత శిశువుకు జీవితంలోని తొలి హక్కుగా తల్లిపాలు అందేలా చూడడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం. ఒక బిడ్డ ఆరోగ్యవంతమైన జీవితానికి పునాది వేయాలంటే పుట్టిన తొలి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం అత్యంత అవసరం. వైదులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి రొమ్ము నుంచి వచ్చే చిక్కటి పసుపు రంగు పాలను ముర్రుపాలు అంటారు. ఇవి చాలా తక్కువ పరిమాణంలో వచ్చినప్పటికీ వాటి విలువ అమూల్యం. వీటిని బిడ్డకు ప్రకృతి ఇచ్చిన మొదటి టీకా అని వైద్యులు అభివర్ణిస్తారు.చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. ముర్రుపాలు పాడైపోయిన పాలు వాటిని పిండేసి పారేయాలి. తర్వాత వచ్చే తెల్లటి పాలు మాత్రమే బిడ్డకు ఇవ్వాలి అని కొందరు భావిస్తారు.ఇది పూర్తిగా అవాస్తవం. ముర్రుపాలను పారబోస్తే బిడ్డకు లభించాల్సిన అత్యంత విలువైన రోగనిరోధక శక్తిని కోల్పోతాడు. ముర్రుపాలలో రోగాలను ఎదుర్కొనే యాంటీబాడీలు అధికంగా ఉంటాయి. వైరస్‌లు, బ్యాక్టీరియాల నుంచి బిడ్డను కాపాడతాయి. బిడ్డ మొదటి మలాన్ని సులభంగా బయటకు పంపి కామెర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. ఊపిరితిత్తులు, పేగులు, మెదడు అభివృద్ధికి తోడ్పడతాయి. భవిష్యత్తులో అనేక అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బిడ్డ పుట్టిన వైద్య నిపుణుల సూచన ప్రకారం బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడే బిడ్డకు పాలు పీల్చే సహజ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. తల్లి శరీరంలో పాల ఉత్పత్తి వేగంగా ప్రారంభమవుతుంది. తల్లి బిడ్డ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. ప్రసవం తర్వాత తల్లికి రక్తస్రావం తగ్గేందుకు కూడా సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాల వల్ల బిడ్డకు కలిగే ప్రయోజనాలు సంపూర్ణ పోషకాహారం. విరేచనాలు, న్యుమోనియా వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. మెదడు ఎదుగుదల మెరుగుపడుతుంది. ఎదిగిన తర్వాత మధుమేహం, ఊబకాయం వంటి సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. తల్లికీ తల్లిపాలు ఇవ్వడం వల్ల లాభాలే. గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి వస్తుంది. ప్రసవానంతర రక్తస్రావం తగ్గుతుంది. రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. తల్లి బిడ్డ మధ్య ప్రేమాభిమానాలు మరింత బలపడతాయి. పుట్టిన బిడ్డకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. నీళ్లు తేనె  గ్లూకోజ్ నీళ్లు అవసరం లేదు. ఆవుపాలు లేదా పొడి పాలు వైద్యుల సలహా లేకుండా ఇవ్వకూడదు. ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు పౌష్టికాహారం ప్రారంభించాలి.



Post a Comment

Previous Post Next Post