ప్రెస్ రిపోర్టర్లుగా ముసుగులో వసూళ్ల ముఠా గుట్టు రట్టు
కామారెడ్డి: RTI ద్వారా ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు సేకరించి, ఉద్యోగం పోయేలా చేస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో ఇద్దరిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ బెదిరింపులకు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు కేసును ఆత్మహత్యకు ప్రేరేపణ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ వివరాలు వెల్లడించారు.
కేసు వివరాలు
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ క్రైం నం.693/2024లో చేపూరి శిరీష అనే మహిళ ఆత్మహత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ప్రభుత్వ ఉద్యోగం, జీతం, సర్వీస్ వివరాలను RTI ద్వారా సేకరించి, ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తూ మానసికంగా వేధించినట్లు ఆధారాలు లభించాయి.
ఇద్దరి అరెస్ట్, కోర్టులో హాజరు
ఈ కేసులో A2 ఇందూరి సిద్దా గౌడ్, A3 లాండే భాస్కర్‌లను 13.08.2026న కామారెడ్డి ప్రాంతంలో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు నేరానికి సంబంధించిన కీలక విషయాలను అంగీకరించారు. అనంతరం ఇద్దరినీ కామారెడ్డి గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ప్రెస్ రిపోర్టర్లుగా ముసుగులో వసూళ్లు
దర్యాప్తులో నిందితులు తమను ప్రెస్ రిపోర్టర్లుగా పరిచయం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యక్తులను టార్గెట్ చేసినట్లు తేలింది. వారిపై ప్రతికూల వార్తలు ప్రచురిస్తామని, అధికారులకు ఫిర్యాదులు చేస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవారని పోలీసులు తెలిపారు.
ఇదే తరహా బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు సంబంధించి కామారెడ్డి, యల్లారెడ్డి, దోమకొండ, గాంధారి, దేవునిపల్లి పోలీస్ స్టేషన్లలో గతంలోనూ పలు కేసులు నమోదైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుత కేసులోనూ ఇదే పద్ధతిలో మృతురాలిపై ఒత్తిడి, బెదిరింపులు, మానసిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరుగుతుందని డీఎస్పీ మధుసూదన్ తెలిపారు.


Post a Comment