Top News

Best Teacher in Country | గాంధారి టీచర్‌కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

AI Image 

గాంధారి టీచర్‌కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

దేశవ్యాప్తంగా ఎంపికైన 48 మందిలో తెలంగాణ నుంచి ఒక్కరే  

బోధనలో కొత్త దారి.. యూట్యూబ్‌తో విద్యా విప్లవం

బొంపల్లి భవానికి దక్కిన అరుదైన గౌరవం

కామారెడ్డి, ఆగస్టు 22: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ గర్ల్స్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న బొంపెల్లి భవానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కింది. దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసిన 48 మందిలో తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక ఉపాధ్యాయురాలు భవానీ కావడం విశేషం. (భవాని బోధన సందర్బంగా చిత్రాలు 👇)


సెప్టెంబర్ 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు

గతేడాది కూడా ఈ అవార్డుకు ఆమె పేరు ప్రతిపాదించగా, ఈసారి ఇంటర్వ్యూలో ప్రతిభ చాటి పురస్కారాన్ని దక్కించుకున్నారు. వచ్చే నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డును అందుకోనున్నారు. 2024లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2025లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న భవాని ఇప్పుడు జాతీయస్థాయికి ఎదిగారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలోనూ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ అభినందనలు తెలిపారు.

X ద్వారా కలెక్టర్ అభినందనలు 
బోధనలో కొత్త దారి.. యూట్యూబ్‌తో విద్యా విప్లవం

భవానీ విద్యార్హత ఎం.ఏ(ఇంగ్లీష్), ఎం.ఎస్సీ(మ్యాథ్స్), డీఈడీ, బీఈడీ. 2006 డీఎస్సీలో ఎంపికై 2008 నుంచి ఉపాధ్యాయురాలిగా 18 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. గాంధారి బాలికల పాఠశాలలో 8 ఏళ్లుగా పనిచేస్తున్నారు.

తరగతి గదికే పరిమితం కాకుండా సాంకేతికతను వినియోగిస్తూ బోధనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. 

- యూట్యూబ్ ఛానల్ ద్వారా బోధన: 'Bompelly Bhavani' పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల పాఠాలు, టీఎల్ఎం, మ్యాథ్స్ ట్రిక్స్, రైమ్స్ విత్ యాక్షన్స్, డీఎస్సీ కంటెంట్, జీకే, కరెంట్ అఫైర్స్ అందుబాటులో ఉంచుతున్నారు. విద్యార్థులు చేసే ప్రతి యాక్టివిటీని రికార్డ్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. ఇవి విద్యార్థులు, ఎస్జీటీ టీచర్లు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.

- నృత్యంతో పాఠాలు: పిల్లలకు పాఠాలు ఎప్పటికీ గుర్తుండేలా భరతనాట్యం, యోగా, పాటలు, నృత్య రూపకంతో బోధిస్తున్నారు.

- పాఠశాల అభివృద్ధికి విరాళం: రాష్ట్రస్థాయి అవార్డు సందర్భంగా వచ్చిన రూ.10 వేలు, తన జేబు నుంచి మరో రూ.10 వేలు కలిపి రూ.20 వేలతో కంప్యూటర్ కొన్నారు. దాతల సహకారంతో మరో కంప్యూటర్, కలెక్టర్ మంజూరు చేసిన మూడింటితో కలిపి ప్రస్తుతం పాఠశాలలో 5 కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి.

పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న భవాని కృషికి జాతీయ పురస్కారం దక్కడం పట్ల అడిషనల్ కలెక్టర్ ఎన్ వై గిరి,జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ అభినందనలు తెలిపారు.  తోటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Note : భవాని యూట్యూబ్ ఛానల్, ఇంస్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్ లో గలదు.


Post a Comment

Previous Post Next Post