సెల్‌ఫోన్ వ్యసనం నుంచి బయటపడాలి, ఆటలు మెదడుకు పదును పెడతాయి - మాజీ మంత్రి హరీష్ రావు
మొబైల్ మనకు బానిస కావాలి, మనం మొబైల్ కు బానిస కావొద్దు - విద్యార్థులకు హితవు
సిద్దిపేట మెరిడియన్ స్కూల్ లో జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ - 2026లో గజ్వేల్ లో స్టేట్ లెవెల్ ఛాంపియన్ షిప్
సిద్దిపేట, ఆగస్టు 31(తెలంగాణ డైలీ న్యూస్):
సిద్దిపేట మెరిడియన్ స్కూల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్‌కు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 168 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ టోర్నీలో పిల్లలతో ఆయన సరదాగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సెల్‌ఫోన్ వ్యసనంపై విద్యార్థులకు హితవు పలికారు.
"ఈ రోజుల్లో పిల్లలకు సెల్‌ఫోన్ వ్యసనంగా మారింది. భోజనం చేసేటప్పుడు ఫోన్ చూస్తే తప్ప ముద్ద దిగని పరిస్థితి. నిన్న ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఏడాదిన్నర చిన్నారి ఫోన్ కు అడిక్ట్ అవ్వడం చూసి ఆశ్చర్యపోయా. మొబైల్ మనకు బానిస కావాలి కానీ, మనం మొబైల్ కు బానిస కావొద్దు" అని అన్నారు.
ఫోన్లు పక్కనపెట్టి ఫుట్‌బాల్, వాలీబాల్, క్రికెట్ లాంటి అవుట్‌డోర్ గేమ్స్ ఆడాలని సూచించారు. గంటల తరబడి ఫోన్ చూడటం వల్ల సృజనాత్మకత, ఆలోచనా శక్తి తగ్గుతుందన్నారు.
చెస్ లాంటి ఆటలు మెదడుకు పదును పెడతాయని, రాజు, మంత్రి, ఏనుగు, బంటు.. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని, కరెక్ట్‌గా ఎత్తు వేస్తే చిన్న బంటు కూడా రాజుకు చెక్ పెడుతుందని చెప్పారు. చెస్‌లో ప్రతి అడుగూ కీలకమని, ఎదుటివారి వ్యూహాన్ని పసిగట్టడం నేర్పుతుందని అన్నారు.
చదువుతో పాటు క్రీడలు, ఆరోగ్యం ముఖ్యమని, గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తే జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొనే శక్తి వస్తుందన్నారు.
"భోజనం చేసేటప్పుడు ఫోన్ చూడమని ప్రామిస్ చేయండి. స్కూల్ డేకు వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటా" అని పిల్లలతో ప్రమాణం చేయించారు.
మెరిడియన్ స్కూల్‌లో చదివిన పేద విద్యార్థిని అఖిల ఎంబీబీఎస్ సీటు సాధించి సిద్దిపేట మెడికల్ కాలేజీలో చేరిందని, నాలుగేళ్లు చదివించిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ అమ్మాయి ఐదేళ్ల మెడిసిన్ చదువు ఖర్చు బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు.
2026లో గజ్వేల్‌లో స్టేట్ లెవెల్ చెస్ ఛాంపియన్ షిప్ నిర్వహిస్తామని, తన సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు.





మంచి వార్తలు, బాగుంది మీ ఆన్లైన్ న్యూస్ శ్రీను బయ్యా
ReplyDeletePost a Comment