Top News

Harish Rao Fire 🔥 బడి తెరిచి 3 నెలలైనా యూనిఫామ్స్ ఏవి?


బడి తెరిచి 3 నెలలైనా యూనిఫామ్స్ ఏవి? గుజరాత్ కంపెనీకి కట్టబెట్టి తెలంగాణ పిల్లలను ఆగం చేస్తారా?: మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్

యూనిఫామ్ కాంట్రాక్ట్ గుజరాత్ పాలు.. తెలంగాణ విద్యార్థులకు ఎదురుచూపులు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక చదువులు మధ్యలోనే ఆపేస్తున్న విద్యార్థులు

జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థులను రోడ్డుపాలు చేసిన కాంగ్రెస్ సర్కార్

చదువుకున్న బడిలోనే ఉద్యోగం చేసి రిటైర్ కావడం కనకయ్య అదృష్టం

సిద్ధిపేట , ఆగస్టు 31 , (తెలంగాణ డైలీ న్యూస్) : 

సిద్దిపేటలోని న్యూ హై స్కూల్ కరీంనగర్ రోడ్ లో జూనియర్ అసిస్టెంట్ కనకయ్య  పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యా విధానాలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండ కట్టారు. విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వడంలో, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. పదిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తన సొంత ఖర్చుతో ఐప్యాడ్లు ఇస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్కూల్ ప్రారంభం కాకముందే పిల్లలందరికీ రెండు జతల బట్టలు ఇచ్చేవాళ్లం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, బడులు తెరిచి మూడు నెలలు దాటినా ఇంతవరకు పిల్లలకు బట్టలు రాలేదు. 

ఆ బట్టల కాంట్రాక్టును మఫత్‌లాల్ అనే గుజరాత్ కంపెనీకి కట్టబెట్టారు. ఆ గుజరాత్ నుంచి బట్టలు ఎప్పుడొస్తాయో, పిల్లలకు ఎప్పుడు కుట్టిస్తారో తెలియని దయనీయ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్, టై, షూస్ అన్నీ వెంటనే విద్యార్థులకు అందించాలి.

ఈ మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం డబ్బులు విడుదల చేయకపోవడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపేసుకునే దుస్థితి వచ్చింది. 

మరోవైపు జీవో 97 తీసుకువచ్చి వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులను రోడ్డు మీదకు తెచ్చారు. బడుల నిర్వహణకు ఇచ్చే స్కూల్ గ్రాంట్స్ కూడా విడుదల కావడం లేదు. 

కేసీఆర్  తెచ్చిన 'మన ఊరు-మన బడి' ఆపేసి, కనీసం ఒక్కటంటే ఒక్క కొత్త క్లాస్ రూమ్ కూడా కట్టలేదు.

కొన్నేళ్లుగా పనిచేస్తున్న స్కావెంజర్లకు 2024 నుంచి జీతాలు ఇవ్వలేదు. పాపం వాళ్లు హెడ్ మాస్టర్లను నిలదీస్తుంటే, అధికారులు జేబులోంచి ఇచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. 

ఉపాధ్యాయులకు ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి, పీఆర్సీ ఊసే లేదు. ఇవాళ రిటైర్ అవుతున్న కనకయ్య గారి లాంటి వాళ్లకు.. వాళ్లు నెలనెలా దాచుకున్న జీపీఎఫ్, ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. 

ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి, డీఎస్సీ ద్వారా కొత్త టీచర్లను తీసుకునే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలి.

ఈ న్యూ హై స్కూల్‌లో దాదాపు 235 మంది పిల్లలు చదువుతున్నారు. పోయినసారి మనకు టెన్త్‌లో 88 శాతం రిజల్ట్ వచ్చింది. ఈసారి వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి. 

పదిలో మంచి మార్కులు సాధించే ఉత్తమ విద్యార్థులకు నా సొంత డబ్బులతో ఐప్యాడ్లు బహుమతిగా ఇప్పిస్తాను. 

ఈ బాధ్యతను ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి, ఇతర టీచర్లు తీసుకుని పిల్లలను బాగా చదివించాలి.

తాను ఏ బడిలో చదువుకున్నాడో, అదే బడిలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందడం బహుశా చాలా అరుదుగా జరుగుతుంది. ఆ అదృష్టం కనకయ్య కి దక్కింది. 

రికార్డ్ అసిస్టెంట్‌గా చేరి, జూనియర్ అసిస్టెంట్‌గా ఆయన రిటైర్ అవుతున్నారు. ఉద్యోగిగానే కాకుండా హరితహారం, సెలవుల్లో విద్యార్థులకు బోనఫైడ్ సర్టిఫికెట్లు ఇవ్వడం, టెన్త్ పిల్లలకు స్పెషల్ క్లాసులు చెప్పించడం, ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహించడం వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో కనకయ్య  చురుగ్గా పాల్గొన్నారు. 

61 ఏళ్లు వస్తే ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ, సామాజిక సేవకు కాదు. ఆయన సేవలు సిద్దిపేట పట్టణానికి, సమాజానికి ఎప్పుడూ ఇలాగే అందాలని కోరుకుంటూ, కనకయ్య కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.






Post a Comment

Previous Post Next Post