ఎస్‌ఐఆర్ హియరింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ప్రతిమా సింగ్
ఎల్లారెడ్డి, ఆగస్టు 27: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 10వ వార్డు, గాంధారి మండలం చద్మల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) హియరింగ్ కేంద్రాలను జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ప్రతిమా సింగ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
హియరింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అందుతున్న సేవలు, నోటీసులు జారీ చేసిన విధానం, ధృవపత్రాల స్వీకరణ ప్రక్రియను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత గడువులోగా తమ ఆధార్, ఇతర ధృవపత్రాలను హియరింగ్ కేంద్రంలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
హియరింగ్ తేదీలు, ప్రదేశాలపై గ్రామాల్లో దండోరా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా హియరింగ్ నిర్వహించాలన్నారు.
ఈ తనిఖీలో ఎల్లారెడ్డి ఆర్డీవో రొడ్డ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్, గాంధారి తహసీల్దార్, సూపర్‌వైజర్లు, బీఎల్ఓలు పాల్గొన్నారు.
----------------------------
రహదారి భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలి - అదనపు కలెక్టర్ విక్టర్
కామారెడ్డి, ఆగస్టు 27: జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం కామారెడ్డి ఐడీఓసీలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ప్రధాన రహదారులపై ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్లను గుర్తించి సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారుల వెంబడి అక్రమంగా నిర్వహిస్తున్న ధాబాలు, ఆక్రమణలను తొలగించాలని సూచించారు.
అటవీ ప్రాంతాల గుండా వెళ్లే వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, వన్యప్రాణుల సంరక్షణకు సహకరించాలని జిల్లా అటవీ అధికారి నీరజ్ కోరారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ అజ్మీరా రామ, ఎక్సైజ్ అధికారి ముకుంద రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.
--------------------------
ఎస్‌ఐఆర్-2026 హియరింగ్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత గడువులోగా ధ్రువపత్రాలు సమర్పించాలి: అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్.వై. గిరి
కామారెడ్డి, ఆగస్టు 27: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SIR-2026)లో భాగంగా కామారెడ్డి పురపాలక సంఘం పరిధిలోని ప్రత్యేక హియరింగ్ కేంద్రంలో గురువారం ఓటర్ల విచారణ ప్రక్రియ నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉదయం 1 గంట నుంచి 49 మంది ఓటర్లకు సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించి, ఓటర్ల వివరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే ఓటరు జాబితాలో పేర్లు నమోదు, తొలగింపు లేదా వివరాల సవరణకు సంబంధించి ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా దరఖాస్తులు చేసుకునే విధానంపై ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్.వై. గిరి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్-2026 కార్యక్రమం ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమని అన్నారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు, ఓటరు జాబితాలోని వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు.
హియరింగ్‌కు సంబంధించి నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత గడువులోగా అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలని, తమకు కేటాయించిన హియరింగ్ తేదీన సంబంధిత కేంద్రానికి హాజరై విచారణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి ఇఫ్తిఖార్ షిరీన్, మున్సిపల్ కమిషనర్ టి. పర్వతాలు, కౌన్సిలర్లు, సూపర్‌వైజర్ అధికారులు, వార్డు అధికారులు, బీఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.






Post a Comment