Top News

Police Raid | కల్లులో ఆల్ప్రాజోలామ్ కలిపి విక్రయం - ఇద్దరు అరెస్ట్

కల్లులో ఆల్ప్రాజోలామ్ కలిపి విక్రయం - ఇద్దరు అరెస్ట్

60 కల్లు సీసాలు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం - ఎల్లారెడ్డి సీఐ డి. రాజారెడ్డి

కామారెడ్డి: ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామంలో కల్లులో మత్తు పదార్థం ఆల్ప్రాజోలామ్ కలిపి విక్రయిస్తున్న ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. 

విశ్వసనీయ సమాచారంతో 06-08-2026న ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్లుట్ల గ్రామంలోని ఓ కల్లు దుకాణంపై ఎస్సై బాల సుబ్రమణ్యచారి ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో దుకాణంలో ఉన్న కల్లు విక్రేత సాతేల్లి నాగేశ్వర్ గౌడ్ ను అదుపులోకి తీసుకుని, వినియోగదారులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 60 కల్లు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో కల్లులో ఆల్ప్రాజోలామ్ అనే మత్తు పదార్థాన్ని కలిపి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.

అదే సమయంలో దుకాణంలో కల్లు సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులకు నిర్వహించిన ప్రాథమిక డ్రగ్ టెస్టులో బెంజోడయాజెపైన్ పాజిటివ్ గా తేలింది. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కూడా BZO పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

దర్యాప్తును కొనసాగించిన పోలీసులు 07-08-2026న కల్లు దుకాణం లైసెన్స్ హోల్డర్ మాసాని మాస గౌడ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. తన కల్లు దుకాణం లైసెన్స్ ను సంవత్సరానికి 2,50,000 రూపాయలకు నాగేశ్వర్ గౌడ్ కు లీజుకు ఇచ్చినట్లు అతడు విచారణలో వెల్లడించాడు.

ఈ కేసులో పోలీసులు 60 కల్లు సీసాలు, రెండు మొబైల్ ఫోన్లు మరియు ఇతర సంబంధిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్లు ఎల్లారెడ్డి సీఐ డి. రాజారెడ్డి తెలిపారు.

ప్రజలకు విజ్ఞప్తి

మత్తు పదార్థాలు కలిపిన కల్లు లేదా ఇతర ఆహార పదార్థాలు, పానీయాలను విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రజలను కోరారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Post a Comment

Previous Post Next Post