Top News

Shabbir Ali | కామారెడ్డి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్

కామారెడ్డి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్

 పరిపాలనా అనుమతులు మంజూరు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షబ్బీర్ కృతజ్ఞతలు  

పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం  

కామారెడ్డిని విద్యా కేంద్రంగా తీర్చిద్దే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు  

కామారెడ్డి:  కామారెడ్డి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ YIIRS ఏర్పాటు చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు.

 పరిపాలనా అనుమతులు మంజూరు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షబ్బీర్ కృతజ్ఞతలు  

ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. 

అందులో భాగంగానే కామారెడ్డి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ద్వారా జి.ఓ.ఆర్.టి. నం.145, తేదీ 04-08-2026 ద్వారా కామారెడ్డి జిల్లా, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి రూ.200 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు.

 పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం  

పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. 

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కామారెడ్డి విద్యార్థులకు గొప్ప అవకాశంగా నిలుస్తుందని, భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్యను అందించి పోటీ ప్రపంచానికి వారిని సిద్ధం చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

ఈ సమీకృత వసతి పాఠశాల ద్వారా విద్యార్థులకు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన పాఠశాల విద్యతో పాటు ఉన్నత విద్యకు అవసరమైన విద్యా వాతావరణం, ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా సదుపాయాలు, వసతి, భోజనం తదితర ఆధునిక మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాసంస్థల ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పన, డిజిటల్ విద్య, ప్రయోగశాలలు, ఆధునిక భవనాల నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు.

 కామారెడ్డిని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు  

కామారెడ్డిని విద్యా కేంద్రంగా తీర్చిద్దాలన్న లక్ష్యంలో భాగంగా రూ.200 కోట్ల ప్రాజెక్టు మరో కీలక ముందడుగు అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తామని, కామారెడ్డి నియోజకవర్గ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

కామారెడ్డి నియోజకవర్గంలోనే ఈ విద్యాలయాన్ని నిర్మించడం జరుగుతుందని మహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్ వై గిరి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమా శ్రీనివాస్, డీసీ మాజీ అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






Post a Comment

Previous Post Next Post